ఎల్‌ఐసీ నుంచి కొత్త ఇండెక్స్‌ ప్లస్‌ పాలసీ

ఎల్‌ఐసీ నుంచి కొత్త ఇండెక్స్‌ ప్లస్‌ పాలసీముంబయి : బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఇండెక్స్‌ ప్లస్‌ పేరిట యూనిట్‌ లింక్డ్‌, రెగ్యులర్‌ ప్రీమియం, వ్యక్తిగత లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చినట్టు ఆ సంస్థ తెలిపింది. జీవిత బీమా కవరేజీతో పాటు పొదుపునకు ఇది మద్దతు చేస్తుందని ఎల్‌ఐసీ చైర్మెన్‌ సిద్దార్థ మోహంతి తెలిపారు. షరతులకు లోబడి ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ అనంతరం పాక్షికంగా ఉపసంహరించుకునే వీలుందన్నారు. గ్యారంటీడ్‌ అడిషన్స్‌ కూడా ఉంటాయన్నారు. నిర్దిష్ట గడువు ముగిసిన అనంతరం వార్షికంగా చెల్లించే ప్రీమియంలో కొంత శాతాన్ని గ్యారంటీ జోడింపుగా యూనిట్‌ ఫండ్‌కు జమ చేస్తామన్నారు. ప్లాన్‌లో చేరేందుకు కనీస వయసు 90 రోజులు. గరిష్ఠ వయో పరిమితి హామీ మొత్తం ఆధారంగా 50 లేదా 60 సంవత్సరాలుగా ఎల్‌ఐసీ నిర్ణయించింది. పాలసీ వివరాలు.. కనీస హామీ మొత్తం వార్షిక ప్రీమియంకు 7 నుంచి 10 రెట్లు. మెచ్యూరిటీకి కనీస వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ఠ వయసు 75 లేదా 85 సంవత్సరాలు. కనీస కాలపరిమితి 10 లేదా 15 సంవత్సరాలు. కనీస ప్రీమియం ఏడాదికి రూ.30,000, అర్థ సంవత్సరానికి రూ.15,000, త్రైమాసికానికి రూ.7,500, నెలవారిగా రూ.2,500గా నిర్ణయించింది. ఎన్‌ఎస్‌ఇ 100 ఇండెక్స్‌ లేదా ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50లలోని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుపెడులు పెట్టే ఫ్లెక్సి గ్రోత్‌ ఫండ్‌ లేదా ఫ్లెక్సి గ్రోత్‌ ఫండ్‌లో ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంది. మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉన్నట్టయితే యూనిట్‌ ఫండ్‌ విలువతో సమానమైన మొత్తం చెల్లించనున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది.