16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి

16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– జీహెచ్‌ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బల్దియా ప్రధాన కార్యాలయంలో సదస్సు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 16న జరిగే గ్రామీణ భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యలయంలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల(సీఐటీయూ,ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, బీఆర్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐయూటీయూసీ)జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్‌, మతతత్వ విధానాలను నిరసిస్తూ ప్రతిఘటనకు పూనుకో వాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 10సంవత్సరాలు పూర్తవుతున్నా రైతాంగ, కార్మికవర్గ,ప్రజల సమస్యలను పరిష్కరించ లేదన్నారు.కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించక పోవడంతో మున్సిపల్‌ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు పని భద్రత, ఉపాధి కరువైందన్నారు. ధరలను నియంత్రిస్తామని వాగ్ధానం చేసిన బీజేపీ ప్రభుత్వంలోనే 30 నుంచి 56 శాతం మేరకు ధరలు పెరిగాయన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేశ్‌ మాట్లాడుతూ.. బీజేపీ రాముని పేరు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మత రాజకీయాలు మంచివి కావని, ఒక రాజకీయ పార్టీ అన్ని మతాలనూ ఐక్యంగా చూడాలని హితవు పలికారు. దేశవ్యాప్తంగా దాదాపు 12కోట్ల మంది ఉద్యోగులను తొలిగించారని తెలిపారు. పెట్రోల్‌, డిజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగం సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసీతోపాటు అన్ని సంస్థలనూ ప్రయివేటీకరణ చేస్తున్నారన్నారు. దేశంలో ఐదు లక్షల గ్రామాలల్లో నీళ్లు, కరెంట్‌ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.
హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బారామారావు, జేఏసీ నాయకులు శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కార్మిక సంఘాల పోరాటంతోనే హక్కులను సాధించుకోవచ్చన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో పాలించిన కేసీఆర్‌ కార్మిక వ్యతిరేక విధాలనాను అవలంబించారన్నారు. కార్మికులు, వర్కర్స్‌తోపాటు హక్కుల కోసం పోరాటం చేసిన వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీలో బయోమెట్రిక్‌ హాజరు పట్టికలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే జాన్‌, ఐఎఫ్‌టీయూ జీహెచ్‌ఎంసీ నాయకులు శివబాబు, ఏఐయూటీయూసీ జీహెచ్‌ఎంసీ నాయకులు అంజనేయులు, జీహెచ్‌ఎంసీ జేఏసీ నాయకులు జైపాల్‌రెడ్డి, అంజయ్య, అంబాద్‌, అనురాధ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్మికులు పాల్గొన్నారు.