– భరోసా కేంద్రాలపై డీజీపీ రవిగుప్తా ప్రశంస
– కొత్తగా 8 భరోసా కేంద్రాలు, ఒక ఎఫ్‌ఎస్‌ఎల్ వెబ్‌సైట్ ప్రారంభం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో బాధితులకు భరోసా కేంద్రాలు చక్కటి సేవలను అందిస్తున్నాయని రాష్ట్ర డీజీపీ డాక్టర్ రవి గుప్తా ప్రశంసించారు. ముఖ్యంగా, బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు గురైన సందర్భంలో బాధితులకు అండగా నిలిచి భరోసా కేంద్రాలు వారి భవిష్యత్తును తిరిగి మంచి మార్గాన్ని ఎంచుకునేలా సహకరిస్తున్నాయని ఆయన కొనియాడారు. మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి ఎనిమిది జిల్లాల్లో కొత్త భరోసా కేంద్రాలను, రాష్ట్ర స్థాయిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్) వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భరోసా కేంద్రాల్లో నిర్వాహకులు బాధితులకు వారు ఎదుర్కొన్న సమస్య నుంచి బయటపడేలా చేయటంలో చక్కటి మార్గదర్శకాలతో దిశానిర్దేశం చేయగలుగుతున్నా రని తెలిపారు. అంతేగాక, వారి కేసులను కోర్టులలో వాదించటానికి న్యాయ సహాయంతో పాటు అవసరమైన వైద్య సేవలను కూడా అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు, కోర్టులలో న్యాయాన్ని సాధించే ఎఫ్‌ఎస్‌ఎల్‌కు సంబంధించి వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేయటం వలన అనేక మందికి దాని పనివిధానంపై అవగాహనను కల్పించగలుగుతున్నామని రవి గుప్తా తెలిపారు. ముఖ్యంగా, అనేక క్లిష్టమైన కేసులలో నేరస్థుల నేరాన్ని నిరూపించే ఆధారాలను వెలికి తీయటంలో ఎఫ్‌ఎస్‌ఎల్ చక్కటి పాత్రను వహిస్తున్నదని అన్నారు. రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ, మహిళా భద్రతా విభాగం ఇంచార్జీ కూడా అయిన షికా గోయెల్ మాట్లాడుతూ.. భద్రాద్రి- కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, రామగుండంలలో కొత్తగా భరోసా కేంద్రాలను ప్రారంభించటం జరిగిందనీ, ఇది ఆ ప్రాంత బాధిత మహిళలకు వెన్నుదన్నుగా ఉంటుందని ఆమె తెలిపారు.