వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి

వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి– మంత్రి కొండా సురేఖ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో వన్యప్రాణుల సంరక్షణ కు కూడా అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, స్టేట్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ చైర్మెన్‌ కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో గల తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో స్టేట్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ ఏడో సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణి ప్రసాద్‌, పీసీసీఎఫ్‌ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం. డోబ్రియాల్‌, పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌) ఎంసీ పర్గెయిన్‌, ఫీల్డ్‌ డైరక్టర్లు క్షితిజ, శాంతారాం, బోర్డు అధికారులు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆర్‌అండ్‌బి, పంచాయతీ, పశుసంవర్ధక శాఖ అధికారులు, బీసీఎన్‌ఎల్‌, టి ఫైబర్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ప్రత్యేక సందర్భాల్లో ఏనుగుల వినియోగంపై త్వరలో విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పాము కాటు వల్ల జరిగే మరణాలకు నష్ట పరిహార వర్తింపుపై ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. రక్షిత అటవీ ప్రాంతాల గుండా వెళ్ళే కొత్త రాష్ట్ర, జాతీయ రహదారుల్లో యానిమల్‌ ప్యాసెజ్‌ల నిర్మాణం ఎత్తు తగ్గింపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనీ, అధికారులు, అటవీ నిపుణులు సమన్వయంతో వ్యవహరించి ఎన్ని ప్యాసేజ్‌ లు ఏర్పాటు చేయాలో నిర్ణయించాలని ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధికి పాలసీని రూపొందిస్తామన్నారు. సత్తుపల్లి, కిన్నెరసాని ప్రాంతాల్లో అడవి దున్నల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రత్యేక శాంక్చురీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో గ్రామాల తరలింపు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోనూ గ్రామాల తరలింపు ప్రక్రియ పై అధ్యయనం చేయాలని సూచించారు. టైగర్‌ ట్రాకర్స్‌ తో పాటు అటవీ శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు చేపడతామని హామీనిచ్చారు. టైగర్‌ రిజర్వుల్లో అగ్ని ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావాలనీ, ఆ దిశగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి సకాలంలో జీతాల చెల్లింపు, కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటు, వన్యప్రాణుల దాడులలో పరిహారం పెంపు పట్ల మంత్రి చూపిన చొరవకు బోర్డు సభ్యులందరు మంత్రిని హృదయపూర్వకంగా అభినందించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
– మారుమూల ప్రాంతాల్లో సెల్‌ ఫోన్‌ కనెక్టివిటీని పెంచేందుకు వచ్చిన 19 ప్రతిపాదనలను స్టేట్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డ్‌ ఆమోదించింది. కోర్‌ ఏరియా పరిధిలోకి వచ్చే ఐదు ప్రతిపాదనలను బోర్డ్‌ ఆమోదించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆవాసాలకు టి ఫైబర్‌ కనెక్టివిటిని కల్పించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
– కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌కు కొనసాగింపుగా కన్సర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. దీని ద్వారా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ తాడోబా టైగర్‌ రిజర్వ్‌ మధ్య కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటవుతుంది. పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు కాగజ్‌ నగర్‌, ఆసిఫాబాద్‌ డివిజన్లలో మొత్తం 1492 చ.కి.మీ ల పరిధిలో కన్జర్వేషన్‌ రిజర్వ్‌ రూపుదిద్దుకోనున్నది.
– వన్య ప్రాణుల దాడుల్లో చనిపోయిన వారికిచ్చే నష్టపరిహారాన్ని 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయాన్ని వైల్డ్‌ లైఫ్‌ బోర్డ్‌ ఆమోదించింది.
– వన్యప్రాణుల రక్షిత ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు, రక్షిత ప్రాంతాల్లో 4 జి మొబైల్‌ టవర్ల నిర్మాణం, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ళ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, టైగర్‌ రిజర్వ్‌లు, ఇతర రక్షిత ప్రాంతాలలో కమ్యూనిటీ ఆధారిత పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం తదితర అంశాల పై బోర్డు చర్చించింది.