– తేల్చిన కేంద్ర ఎన్నికల కమిషన్
– శరద్ పవార్‌కు షాక్..
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీలిక వర్గ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేతికి ఎన్సీపీ, దాని ఎన్నికల గుర్తు దక్కుతుందని ఈసీ తెలిపింది. ఎన్సీపీకి అసలైన నేతగా అజిత్ పవారేనని పేర్కొంది. ఎన్‌సీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో అసెంబ్లీలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును ఈసీ కేటాయించింది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తన వర్గానికి ఒక పేరును ఎంచుకోవాలని శరద్ పవార్‌కు ఈసీ సూచించింది. బుధవారం (7వ తేదీ) మధ్యాహ్నం 4 గంటల లోపు తమ వర్గం పేరు, గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని గడువు ఇచ్చింది. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ -షిండే సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. అప్పటి నుంచి అసలైన ఎన్సీపీ ఎవరిదనే దానిపై శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య వివాదం కొనసాగుతున్నది. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలికతో ప్రస్తుతం శరద్ పవార్‌కు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నది.