మధ్యప్రదేశ్‌లో దారుణం

It is worse in Madhya Pradesh– బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు ఎగిసి పేలుళ్లు
– 11 మంది మృతి.. వంద మందికి గాయాలు
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు ఎగిసి పేలుళ్లు సంభవించిన ఘనటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన హర్దాలో చోటు చేసుకున్నది. ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించటంతో అనేక పేలుళ్లు జరిగాయి. దీంతో చుట్టుపక్కన ప్రాంతాలు వణికిపోయాయి. గాయాలపాలైనవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ పేలుళ్ల కారణంగా నర్మదాపురం జిల్లాలోని సియోని మాల్వా ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్టు అక్కడి ప్రజలు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం మోహన్‌ యాదవ్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంటల్లో చిక్కుకొని గాయాలపాలైనవారి కోసం భోపాల్‌, ఇండోర్‌లో మెడికల్‌ కాలేజీలను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఘటనా ప్రదేశానికి అనేక ఫైర్‌ ఇంజిన్లను తరలించినట్టు సీఎం ‘ఎక్స్‌’లో వివరించారు. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి, పొగ కమ్ముకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మంటలు, పొగ పెత్త ఎత్తున చెలరేగటంతో దగ్గరలో ఉండే ప్రజలు భయానికి పరుగెత్తారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పటానికి ప్రయత్నిస్తున్నాయని అధికారులు చెప్పారు. ”రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ను కూడా పిలిచాం” అని జిల్లా కలెక్టర్‌ రిషి గార్గ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో దాదాపు 150 మంది ఉన్నట్టు ఒక కార్మికుడు చెప్పాడు.