– కనీసం 13 ఎంపీలు గెలవాలి
– నల్లగొండలో భారీ బహిరంగసభ
– కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విస్తృతంగా ప్రచారం
– రాష్ట్రం నుంచి సోనియా పోటీ చేయాలంటూ ఏకవాక్య తీర్మానం
– గాంధీభవన్‌లో టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలుంటే, అందులో 16 సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తక్కువలో తక్కువగా 13 సీట్లను కైవసం చేసుకునేందుకు శాయశక్తుల కృషి చేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతలు కలిసి కట్టుగా కష్టపడి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారనీ, అదే స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో పని చేయాలని కోరింది. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశమైంది.
ఇప్పటికే ఇంద్రవెల్లి నుంచి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కాంగ్రెస్…మరో భారీ బహిరంగ సభను నల్లగొండలో నిర్వహించనున్నట్టు, ఆ సభకు సోనియాగాంధీ లేదా ప్రియాంకగాంధీ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు రెండు లక్షల మందికి మించి జనసమీకరణ చేయాలని పార్టీ నేతలను అధిష్టానం ఆదేశించింది. సభకు సంబంధించిన స్థలం, సమయాన్ని త్వరలో వెల్లడించనున్నట్టు నేతలు చెప్పారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్… ఆపరేషన్ తర్వాత పార్లమెంటు ఎన్నికల వైపు అడుగులేస్తున్నారు. ఈనెల 13న నల్లగొండలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సభకు కౌంటర్‌గా కాంగ్రెస్ కూడా అదే జిల్లాల్లో బహిరంగసభకు ప్లాన్ చేయడంతో నల్లగొండ నుంచే ఎన్నికల సమరం వేడెక్కనుంది. సూర్యాపేట మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ తొలి సభ పెడుతున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడా తగ్గొదంటూ పార్టీ శ్రేణులను రేవంత్‌రెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని కాంగ్రెస్ కార్యకర్తలు జనాల్లోకి తీసుకు వెళ్లాలని, ఆ ప్రాజెక్టుపై అసెంబ్లీల్లో చర్చ నిర్వహిస్తామనీ, ఇప్పటికే విచారణ కొనసాగుతున్నదని వివరించారు. అవినీతిలో భాగస్వాములైన ఎవ్వరినీ వదిలి పెట్టబోమని రేవంత్‌రెడ్డి చెప్పారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో అధికారులు, రాజకీయ నాయకులు ఎవరున్నా…వదిలి పెట్టబోమని పేర్కొన్నారు. ఎంపీ టికెట్ల కోసం ఇప్పటికే 309 మంది నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆవివరాలను క్రోడికరించిన 32 పేజీల బుక్‌లేట్‌ను టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యులకు అందజేశారు. దానిపై టిక్ మార్క్ చేసి, బుధవారం మధ్యాహ్నం లోగా గాంధీభవన్‌లో అందజేయాలని కోరారు.