16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి: సీఐటీయూ

నవతెలంగాణ –  తుంగతుర్తి
కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బిల్డింగ్ వర్కర్స్ తో సమావేశమై పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల చట్టాల నాలుగు కోడ్ ల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాల రద్దు వల్ల కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లాభాలు సమకూర్చడం కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక సంక్షేమంపై కార్మిక హక్కులపై దాడి చేస్తుందని అన్నారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగానికి తగిన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ పథకాల అమలుకు ఏర్పాటు చేయబడిన సంక్షేమ బోర్డులను కేంద్రం బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని,ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను,డీజిల్ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది అన్నారు. ఈ మేరకు ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రభాకర్,రమేశ్,అసంఘటిత కార్మికులు దేవా,సతీష్,సుందర్,వెంకన్న,మల్లయ్య,సోమయ్య, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.