కృష్ణార్పణం కానివ్వొద్దు

కృష్ణార్పణం కానివ్వొద్దుకృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు ప్రాజె క్టుల అప్పగింత, నీటివాటాల సంగతి రాష్ట్రంలో రాజ కీయ వేడి రగిలిస్తున్నది. దాదాపు యాభై ఏండ్ల కిందటి గొడవ మళ్లీ రాజుకోవడానికి కారణమైంది. ఇప్పటిదాకా ఇది తెలుగు రాష్ట్రాల మధ్యేగాక తెలంగాణలో పాలక, ప్రతిపక్షాలకు పాకింది. కృష్ణా జలాల వివాదాలు నిత్యకృ త్యమయ్యాయి. నానాటికి పెను సమస్యగా మారింది. కలహాల భోజ్యంగా తయారైంది. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, తెలంగాణ దప్పిక తీరుస్తూ, పరివాహక ప్రాంతానికి లక్షల ఎకరాలకు సాగునీటినందిం చేదే కృష్ణానదీ సమస్యను గుర్తించి పరిష్కరిం చుకునే బదులు తప్పు మీదంటే మీదని అధికార, విపక్షాలు గిల్లికజ్జాలకు దిగాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగించడం అంటే తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనంటూ ఒకరికొకరు నీతిసూత్రాలు వల్లించుకుంటున్నారు. రేవంత్‌ సర్కారు కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందనే విమర్శలకు బీఆర్‌ఎస్‌ దిగడం, కాదు కాదు ఆ ఘనకార్యం మీరే చేశారంటూ కాంగ్రెస్‌ సర్కారు ఎదురుదాడి చేయడంతోపాటు మొత్తం రికార్డులను మీడియా ముందుంచే ప్రయత్నాన్ని గమనిస్తున్నాం. ఇందులో ఏదీ నిజమో భవిష్యత్‌లో తేలనుంది.
సందట్లో సడేమియాలా నేనేమీ తక్కువ తినలేద న్నట్టు సమస్యను పరిష్కరించే బాధ్యతను కేఆర్‌ఎంబీ పైకి నెట్టేసి కేంద్రంలోని మోడీ సర్కార్‌ చేతులు దులుపు కుంది. శవాల మీద పేలాలు ఏరుకునే బుద్దున్న బీజేపీ సమస్యను నాన్చింది. దేశాల మధ్య నదీజలాల సమస్యను పరిష్కరించుకున్నామని డబ్బా కొట్టుకున్న కేంద్రం, ఇప్పుడు అంత:రాష్ట్ర సమస్యల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ బోర్డుల పేర కేంద్రం తెరవెనుక నాటకమాడుతున్నది. వ్యవహారాన్ని సాంతం సమీక్షించి, మొత్తం నికరజలాలు, మిగులు జలా లను కొత్త ట్రిబ్యునల్‌ ద్వారా పున:పంపిణీ చేస్తే సమస్య అంతమయ్యే అవకాశమెక్కువ. అయితే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ఏడారిగా మారు తుందని తెలంగాణ వాదన. దీంతో పరిపాలనా, పర్యా వరణ అనుమతుల్లేకుండా ఏపీ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని తొలినుంచి మోడీ సర్కారుకు మొరపెట్టు కుంటూనే ఉంది. అయినా అడుగుముందుకు పడలేదు. సుప్రీంకోర్టు కేసు ఉపసంహరిస్తే సమ స్యను పరిష్కరిస్తామని రెండేండ్లుగా పెండింగ్‌లో పెట్టిన సంగతి ఎవరికి తెలియనిది? కాగా రాష్ట్రంలోని ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలు మాత్రం చడీచప్పుడు చేయకపోవడం విడ్డూరం.
1964లో బచావత్‌ ట్రిబ్యునల్‌ తొలుత చేసిన కేటా యింపుల్లో 520 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు దక్కాయి. అప్పట్లో ప్రాజెక్టులతో పాటు ఆయకట్టూ తక్కువే. ఇప్పుడు ఆయకట్టుతోపాటు తాగు నీటి అవసరాలు పెరిగాయి. 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌ కుమార్‌ కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్‌-2 తీర్పు వచ్చే వరకు 50:50 నిష్పత్తి చొప్పున జలాలను వాడుకోవడా నికి అంగీకరించాలని కేఆర్‌ఎంబీని తెలంగాణ కోరుతు న్నది. అలాగే కేఆర్‌ఎంబీ సైతం కేంద్రం సైగలతో దాగు డు మూతలాడుతున్నది. అపెక్స్‌ కౌన్సిల్‌తో సమస్యను పరిష్కరింపచేయకుండా కేంద్రం సాగదీస్తూ వచ్చింది. బలప్రయోగం ద్వారా ఏపీ రెండు వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోవడానికి సహకరించింది. కేంద్రం మద్దతే లేకపోతే ఏపీ అంత బరితెగించేదా? పరిష్కరించ డంలో ఆలస్యం మూలంగా శాంతిభద్రతల సమస్యా తలెత్తడం గమనార్హం.
ఢిల్లీలో డిసెంబరు 17న జరిగిన సమావేశం మిని ట్స్‌నే తప్పుగా పంపడం వెనుక ఉన్న ఉద్దేశమేంటి? అధి కారులు చెప్పింది ఒకటికాగా, మినిట్స్‌లో పొందు పరిచిం ది మరొకటి. సమస్యలన్నీ పరిష్కరిస్తే కేఆర్‌ఎంబీ కి ప్రాజెక్టులను అప్పగిస్తామనడం వేరు, బేషర తుగా అప్పగించారనడం వేరనే సంగతి బోర్డు గ్రహించాలి. బీఆర్‌ఎస్‌ సర్కారు బడ్జెట్‌లో ప్రాజెక్టుల నిర్వహణకు రూ.200 కోట్లను ప్రతిపా దించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనితో పాటు ఇతర పత్రాలపై బీఆర్‌ఎస్‌ హయాంలో అధికారులు చేసిన సంతకాలను కాంగ్రెస్‌ సాక్ష్యం గా చూపుతున్నది. అయితే రేవంత్‌ చెప్పినట్టుగా అఖిలపక్షం నిర్వహించి ఉంటే సమస్య పరిష్కారా నికి శాస్త్రీయ పరిష్కారం దొరికే అవకాశముం డేది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే లా ప్రభుత్వం చొరవ చేయాలని సాగునీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌తో సమస్యను పరిష్కరించే బాధ్యత మోడీ సర్కార్‌దే. అలాగే మొత్తం వ్యవహారంపై రేవంత్‌ సర్కారు ఒటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా శాసనసభలో ప్రవేశపెట్టే శ్వేతపత్రంపై చర్చద్వారా సమస్యను సానుకూలంగా పరిష్కరించాల్సిన అవసరమూ ఉంది.