– బంగారం, సెల్ఫోన్లు, ఆపిల్ వాచ్, డ్రిల్లింగ్ మెషిన్ స్వాధీనం
– వివరాలు వెల్లడించిన ఎస్పీ చందనా దీప్తి
నవతెలంగాణ-నల్లగొండటౌన్
నల్లగొండ శివారులో ప్రేమజంటలను బెదిరించి సెల్ఫోన్లు, నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రం లోని పోలీస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం ఉదయం టూ టౌన్ సీఐ, ఎస్ఐ, సిబ్బంది నల్లగొండ శివారులో గల నర్సింహా రెడ్డి కాలనీలో ఉన్న కుంచం చందు ఇంటిపై దాడి చేశారు. అతన్ని, అక్కడ ఉన్న కుంచం ప్రశాంత్, చింతా నాగరాజు, అన్నెపూరి లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్, కుంచం రాజును అదుపులోకి తీసుకున్నా రు. అనంతరం వారిని విచారించారు. వారు కొద్ది రోజులుగా నార్కెట్‌పల్లి- అద్దంకి హైవే దారిలో పోయే ప్రయాణీకులు, ప్రేమ జంటలను, ఖాళీ స్థలాల్లో ఏకాంతంగా గడుపుతున్న వారిని రహస్యం గా వీడియోలు, ఫొటోలు తీసేవారు. వాటిని చూపించి బాధితులను బెదిరించి నగలు, సెల్ ఫోన్లు, డబ్బులు వసూలు చేస్తుంటారు. బాధితులు వారికి భయపడి విషయం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయేవారు. నిందితులు అలా దోపీడీ చేసిన డబ్బులను తాగుడుకు, విలాసాలకు ఖర్చు చేస్తు న్నారు.ఈ ముఠా డిసెంబర్ చివరి వారంలో నార్కెట్ పల్లి- అద్దంకి హైవే పక్కన నర్సింహా రెడ్డి కాలనీకి వెళ్లేదారిలో ఓ వ్యక్తి, మహిలను బెదిరించి నగదు, అరతులం బంగారం ఉంగరం తీసుకోవ డమే కాకుండా.. ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు.
పట్టణంలోని గొల్లగూడ శివారులోని దత్తా త్రేయ వెంచర్లో గెస్ట్‌హౌస్ తాళం పగుల గొట్టి రెండు టీవీలు, డ్రిల్లింగ్ మెషిన్, మూడు ఫ్యాన్లు, ఇన్వర్టర్, హోం థియేటర్, గ్యాస్‌స్టౌలను దొంగిలిం చారు. ఫిబ్రవరి 1న ఓ యువతి, యువకుడు కారులో వచ్చి పానగల్ హైవే పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెట్టుకింద భోజనం చేస్తుండగా వారిని బెదిరించి.. యువకున్ని కొట్టి రెండు సెల్ఫోన్లు, 700 నగదు దోచుకుని పారిపోయారు. చింత నాగరాజు నేరాలు చేసేటప్పుడు ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను నల్లగొండ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనం చేశాడు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి బంగారు ఉంగరం, రెండు సెల్ ఫోన్లు, రెండు టీవీలు, ఆపిల్ వాచ్, మూడు ఫ్యాన్లు, డ్రిల్లింగ్ మెషీన్, ఇన్వర్టర్, హౌం థియేటర్, గ్యాస్ స్టౌ, మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మీనారాయణ, టూ టౌన్ సీఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ నాగరాజు, సిబ్బంది బాలకోటి, శంకర్ ఉన్నారు.