ఒలింపిక్‌ విజేతలకు ఈఫిల్‌ టవర్‌ మెడల్‌

– 2024 ఒలింపిక్‌ మెడల్స్‌ ఆవిష్కరణ
పారిస్‌ (ఫ్రాన్స్‌) : 2024 ఒలింపిక్స్‌ పతక విజేతలు చారిత్రక ఈఫిల్‌ టవర్‌ను అందుకోనున్నారు. ఈ మేరకు పారిస్‌ ఒలింపిక్స్‌ టోర్నీ నిర్వాహకులు మెడల్స్‌ను సృజనాత్మకంగా రూపొందించారు. పసిడి, రజతం, కాంస్య పతకాల నడుమ షడ్బుజాకారంలోని ఈఫిల్‌ టవర్‌ ఉక్కును అందుకోనున్నారు. ఈఫిల్‌ టవర్‌కు ఇంతకాలం ఆధునీకరణ పనులు చేయగా, అందులో వాడిని ఉక్కును ఓ రహస్య ప్రదేశంలో భద్రపరుస్తారు. ఈ మెడల్స్‌కు ఆ ఉక్కును వాడుతున్నారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ పతకాలను గురువారం ఆవిష్కరించారు. ‘ ఒలింపిక్‌ క్రీడలను ఫ్రాన్స్‌తో ముడిపెట్టాలనేది మా ఆలోచన. ఫ్రాన్స్‌, పారిస్‌లకు ఐకానిక్‌ చిహ్నం ఈఫిల్‌ టవర్‌. అందుకే ఒలింపిక్‌ విజేతలు తమతో పాటు ఈఫిల్‌ టవర్‌ ఉక్కు ముక్కను తీసుకెళ్లే అవకాశం కల్పించాం. గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌లో 18 గ్రాముల షడ్బుజాకార ఉక్కు టోకెన్‌ను పొందుపరిచామని’ అని పారిస్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌ డైరెక్టర్‌ రిబోల్‌ తెలిపారు. ఒలింపిక్‌ పతకాల వెనుక భాగంలో గ్రీకు విజయ దైవం నైకితో పాటు ప్రాచీన ఏథెన్స్‌ కోట ఏక్రోపోలిస్‌, ఈఫిల్‌ టవర్‌లు ఉండనున్నాయి.