– మిగతా హామీలకు గ్యారంటీ ఇవ్వరా?
– బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆరు గ్యారంటీలు తప్ప, ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన మిగతా హామీలకు గ్యారంటీ గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవటం విచారకరమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి దన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనీ, సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని గాడిలో పెట్టాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తు చేసుకోవటం మంచిదే కానీ.. బీజేపీని విస్మరించటం ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని విమర్శించారు.ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వటమే ప్రభుత్వ విజయం కాదన్నారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ. 10లక్షలకు పెంచినప్పటికీ అది అమలుకు నోచుకోవటం లేదని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ బాధితులు ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని వివరించారు. 60నుంచి 70వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో బెల్టుషాపులు విచ్చల విడిగా ఉన్నాయనీ, వాటిని ఎప్పటి నుంచి మూసేస్తారనే విషయమై గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవటం విచారకరమన్నారు.పంటల బీమా, రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా ఆ ప్రసంగంలో లేదని తెలిపారు. గత ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందనీ, ఈ ప్రభుత్వం అలానే చేస్తుందా? అని శంకర్ ప్రశ్నించారు.