– 14న నోటిఫికేషన్ జారీ
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ ఈనెల 14న విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ ఎస్‌కే మహమూద్, ఓయూ వీసీ డి రవీందర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ శుక్రవారం హైదరాబాద్‌లో ఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు ఏప్రిల్ 16వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.500తో అదేనెల 22 వరకు, రూ.వెయ్యితో 28 వరకు అవకాశముందని సూచించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 24 నుంచి 28 వరకు సవరణ చేసుకోవచ్చని కోరారు. మే ఒకటి నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈసెట్ రాతపరీక్ష మే ఆరో తేదీన ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.