– ఇతర ఖర్చులు, అలవెన్స్‌లు విడుదల చేయండి : సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి
– కలెక్టరేట్ వద్ద ధర్నా, ఏఓకు వినతిపత్రం
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎఎన్‌ఎంలకు వివిధ కార్యక్రమాలకు ఇవ్వాల్సిన ఖర్చులను, అలవెన్స్, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జె.కుమారస్వామి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే అనేక కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నారని, టార్గెట్లను పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో వారికి అయ్యే ఖర్చులు, అలవెన్స్ మాత్రం అందడం లేదన్నారు. వారికి వేతనాలు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కొన్ని యూపీఎస్సీలలో కొన్ని రకాల ఖర్చులు అలవెన్స్‌లను కొద్ది మొత్తంలో ఇచ్చినప్పటికీ ఎక్కువ సెంటర్లలో ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచడం సరికాదన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్‌సీడీ పని భారం తగ్గించాలని, ఎన్‌సీడీ ఎంట్రీస్‌కు ప్రత్యేక ఏజెన్సీని నియమించాలని కోరారు. మిషన్ ఇంద్రధనస్సు, కంటి వెలుగు, ఎన్.డి.డి, ఏ.వి.డిల ఖర్చులు, అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎ.కవిత, నగర ఉపాధ్యక్షులు పి.లక్ష్మీబాయి, నగర ప్రధాన కార్యదర్శి బి.కిరణ్మయి పాల్గొన్నారు.