– ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్, హరీశ్‌రావు వాగ్వివాదం
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వివాదానికి దిగారు. తప్పు మీదంటే…కాదు మీదే అంటూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బీఆర్‌ఎస్ సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు అప్పగిస్తామని కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి వచ్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ సమావేశ మినిట్స్‌ను ప్రస్తావించారు. దీనికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014-15 నుంచి 2023-24 వరకు ఆంధ్రప్రదేశ్‌కు 550 క్యూసెక్కులు, తెలంగాణకు 290 క్యూసెక్కుల నీళ్లు సరిపోతాయని బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కేంద్రంతో ఒప్పందాలు చేసుకుందని చెప్పారు. ఈ సందర్భంగా పరస్పరం వాగ్వివాదం జరిగింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని, 2023-24 బడ్జెట్ పుస్తకంలో కేఆర్‌ఎమ్‌బీ, జీఆర్‌ఎమ్‌బీలకు చెరో రూ.200 కోట్లు.. మొత్తంగా రూ.400 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లోనే పేర్కొన్నారని ఆ కాపీ చూపారు. అది ప్రతిపాదన మాత్రమేననీ, తాము విధించిన షరతులు అంగీకరిస్తేనే నిధులు విడుదల చేస్తామని ఆయా బోర్డులకు చెప్పామని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. సాగునీటి పారుదల ప్రాజెక్టులపై ఈనెల 12న పూర్తిస్థాయి చర్చ ఉన్నదనీ, ఆ రోజు ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వచ్చి వాస్తవాలు చెప్పాలంటూ… ‘ఆయన సభకు రారు…వీళ్లకు నిజాలు తెలియవు’ అని అన్నారు. ఈ సందర్భంగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు కూడా పలుమార్లు వాగ్వివాదానికి దిగారు.