నవతెలంగాణ – హైదరాబాద్: గ్రీన్ ఫీల్డ్ సిటీలు అభివృద్ధి చేయడానికి ‘ఆల్ ఇండియా మాస్టర్ ప్లాన్స్’, ‘ఆల్ ఇండియా స్టేట్ ప్లాన్స్’ తప్పనిసరని ఎన్ఏఆర్ఈడీసీవో అధ్యక్షుడు జీ హరిబాబు తెలిపారు. 16వ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్ఏఆర్ఈడీసీవో) నేషనల్ కన్వెన్షన్ ‘పారదర్శకతతో విశ్వాసాన్ని పెంపొందించడం, మార్గం 2047’ అనే అంశంపై రెండు రోజుల సమావేశం ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సమయానికి భారతదేశానికి ఈ ప్రణాళికలు అవసరమన్నారు. భారతీయ రియల్ ఎస్టేట్, నిర్మాణ పరిశ్రమ వృద్ధికి ఇవి ప్రాథమిక అవసరమని స్పష్టం చేశారు. వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న 8 నుంచి 9 శాతాన్ని 6, 6.5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. గృహనిర్మాణ రంగ వృద్ధికి వడ్డీ రేట్ల తగ్గింపు చాలా అవసరమన్నారు. 20 లక్షల వరకు రుణాలపై ప్రారంభంలో ఐదేళ్ల వరకు వడ్డీ రేటును సంవత్సరానికి ఐదు శాతంగా నిర్ణయించాలని పట్టుబట్టారు. ఆ తర్వాత సర్దుబాటు చేసుకునే వడ్డీ రేటును ప్రతిపాదించారు. ఈ కాలంలో రుణ గ్రహీతలపై ఎటువంటి అదనపు ఈఎంఐ విధించబడకుండా మొదటి ఐదు సంవత్సరాలు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ దీనికి దోహదపడాలన్నారు. ఈ వ్యూహాత్మక విధానం సరసమైన గృహ అవకాశాలను సులభతరం చేయడం ‘అందరికీ హౌసింగ్’ అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించే విశాల దృక్పథాన్ని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్ఏఆర్ఈడీసీవో ఛైర్మన్ డాక్టర్ నిరంజన్ హీరానందని మాట్లాడుతూ భారతదేశంలో ‘అద్దె గృహాల విధానం’ ఆమోదించాలన్నారు. ప్రతిపాదిత రెంటల్ హౌసింగ్ పాలసీలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంటి సంస్థలు, ఆర్‌బీఐతో సహా ఆర్థిక సంస్థలు ప్రతిపాదనను ఫలవంతం చేయడానికి దోహదం చేయగలవన్నారు. 50 శాతం జనాభా అద్దె గృహాలను ఇష్టపడే యూఎస్ఏ వంటి విజయవంతమైన మోడల్‌ల నుంచి నేర్చుకోవడంపై దృష్టి పెట్టారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ టెండర్ ప్రక్రియ సమయంలో బిల్డర్లు వాస్తవ మొత్తం కంటే దాదాపు 15 శాతం తక్కువగా కోట్ చేస్తున్నారని, పూర్తయ్యే కొద్దీ ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇది బిల్డర్లు, లబ్ధిదారులను ప్రభావితం చేసే సబ్‌కాంట్రాక్ట్ సమస్యలకు దారి తీస్తుందన్నారు. హౌసింగ్ ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడం ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్, పట్టణ వ్యవహారాల కార్యదర్శి మనోజ్ జోషి మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ఉందన్నారు. ఎన్ఏఆర్ఈడీసీవో ప్రభుత్వంతో సహకరించాలన్నారు. అవసరమైన ఇన్‌పుట్‌లను అందించాలన్నారు. అదనంగా పన్ను సడలింపుల కోసం పరిశ్రమల అభ్యర్థనలను పరిష్కరిస్తూ, పట్టణ ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి నిర్మాణాత్మక సూచనలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలు ఆస్తి పన్నులను పెంచమని ప్రోత్సహిస్తుందన్నారు. 16వ ఆర్థిక సంఘం భవిష్యత్ కేటాయింపుల కోసం దీనిని పరిగణలోకి తీసుకున్నందున, పురోగతి కోసం ఎదురుచూస్తూ, గృహనిర్మాణ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించడం దీని లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఎన్ఏఆర్ఈడీసీవో ఉపాధ్యక్షుడు భరత్ అగర్వాల్ మాట్లాడుతూ 2047 కోసం మా విజన్ భారతీయ రియల్ ఎస్టేట్ రంగానికి స్థిరమైన మార్గాన్ని ఏర్పరుస్తుందన్నారు. ఇది పరివర్తన ధోరణులను స్వీకరించడం, భవిష్యత్ నగరాలను రూపొందించడం, నిరంతర వృద్ధి కోసం నియంత్రణ, విధాన సమలేఖనాన్ని నిర్ధారిస్తుందని తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీల (రెరా) చీఫ్‌లు తమ విభిన్న అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సమావేశం వేదికను కల్పించింది. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్‌లు, చట్టపరమైన సవాళ్లు, డెవలపర్‌ల డిఫాల్ట్‌లు వంటి సమస్యలు చర్చించారు. ఢిల్లీ ఆర్ఈఆర్ఏ చీఫ్ ఆనంద్ కుమార్, డెవలపర్లు ఆర్తోఈఆర్ఏ మధ్యతరహా ప్రాజెక్ట్‌లను నమోదు చేయడానికి ఇష్టపడకపోవడాన్ని ఎత్తిచూపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ఆర్ఈఆర్ఏ చీఫ్ అనితా కర్వాల్, ఒడిషాలోని ఆర్ఈఆర్ఏ చీఫ్ ప్రదీప్ కుమార్ బిస్వాల్, అర్ఈఆర్ఏ హిమాచల్ ప్రదేశ్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ బల్డి, హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) చైర్మన్, సంజయ్ కులశ్రేష్ఠ, నెక్ట్స్‌జెన్‌కి కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.