ప్రజా సంక్షేమ బడ్జెట్

– టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
– బీసీ సంక్షేమం కోసం రూ.8,000 కోట్లు కేటాయించడం పట్ల హర్షం
నవతెలంగాణ – ఆమనగల్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రకటించిందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం రూ.8,000 కోట్లు కేటాయించడం హర్షనీయమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అందుకు అణుగుణంగా ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూ.2 లక్షల 75 వేల 891 కోట్లు కేటాయింపులు చేసిందని ఆయన చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల చొప్పున అదనపు నిధులు కేటాయించడంతో పాటు ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం రూ.21,874 కోట్లు, ఎస్టీ రూ.13,013 కోట్లు, మైనార్టీ రూ.2,262 కోట్లు, వైద్య రంగం రూ.11,500 కోట్లు, విద్యారంగానికి రూ.21,389 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూ.500 కోట్లు, యూనివర్సిటీలకు రూ.500 కోట్లు, పంచాయతీ రాజ్ కు రూ.40,080 కోట్లు, వ్యవసాయ శాఖ రూ.19,746 కోట్లు, నీటి పారుదల శాఖ రూ.28,024 కోట్లు, విద్యుత్ గృహజ్యోతి పథకం అమలుకు రూ.2,418 కోట్లు కేటాయించడం హర్షనీయమని పేర్కొంటూ అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.