సమాజ ‘మార్పుకోసం’

పడాల బాలజంగయ్యకి అంకితం వెలువరించిన ఈ వ్యాససంపుటిలో 31 వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు వీక్షణం, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో ప్రచురణలైనాయి. ప్రగతి నిరోధకశక్తులకు, ప్రజాస్వామిక శక్తులకు మధ్య ఏదో ఒక రూపంలో ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈనాడు దేశంలో అర్థ ఫాసిస్టు దశలో రాజకీయ వాతావరణం నెలకొంది. పాలమూరు అధ్యయన వేదికవారు ఎంతో విలువైన సమాచారంతో ప్రజాస్వామిక శక్తులకు, పురోగామిక శక్తులకు చక్కటి అవగాహన పెంచే సైద్ధాంతిక బలంగల గొప్ప వ్యాస సంపుటి తేవడం అభినందించాల్సి విషయం. ఇప్పటికే వారు 53 పుస్తకాలు ప్రచురించారు. రచయితగా, ప్రొఫెసర్‌గా, పౌర హక్కుల ఉద్యమనేతగా, సామాజిక కార్యకర్తగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితులు హరగోపాల్‌. స్వేచ్ఛారావం/ స్వేచ్ఛకోసం/ ప్రజాస్వామ్యం విద్యకోసం మరోపోరాటం/ పరిమళించిన మానవత్వం/ సందర్భం సవాళ్లు – లాంటి పుస్తకాలు హరగోపాల్‌ వెలువరించారు. పెట్టుబడిదార్లు సేవచేసే అధికార పార్టీల్ని విపులంగా ఈ పుస్తకంలో చాలా వ్యాసాల్లో ఆయన చేసిన విశ్లేషణ ఆలోచింపజేస్తుంది.
2008 సంవత్సరం వ్యాసంలో రాజకీయ పరిణామాలు – కేంద్ర రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాలు, (7 లక్షల కోట్లు చేరిన కేంద్ర బడ్జెట్‌), ఎన్‌.టి.ఆర్‌ – దేవేంద్రగౌడ్‌, చిరంజీవి లాంటి వారి ప్రత్నామ్యాయాల రాజకీయాలు, అణు ఒప్పందాన్ని వ్యతిరేకించిన సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల వైఖరులు.. గ్రామీణ ప్రజలు – వారి చైతన్యస్థాయి, వ్యవసాయ సంక్షోభం, పార్లమెంటరీ చట్రం బయట జరిగే ఉద్యమాల పట్ల ఏ రాజకీయ పార్టీ(ల)కీ అవగాహనలేని స్థితి చర్చించారు.
యాభై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్‌ విజయాలు – వైఫల్యాలు (పేజీ 19), రాజ్యం – ప్రజా ఉద్యమం – బంధీలు వ్యాసంలో మావోయిస్ట్‌ పార్టీ రాజకీయాలు.. కిడ్నాపులు, చర్చలు, ఆదివాసుల స్థితి (పేజీ 47) రాశారు. బిజెపి సామ్రాజ్యవాదులతో మిలాఖత్‌ (పేజీ 53), విద్యుత్‌ కార్మికుల సమ్మె (పేజీ 35), అంబేద్కర్‌ 129 జయంతి రోజే ఆయన కుంటుంబ సభ్యుడు ఆనంద్‌ తెల్తుంబ్డే జైలు పాలుకావడం, రాజ్యం ద్వంద్వ విధానాలు చెప్పే ‘నిర్భంధం’లో డా||అంబేద్కర్‌ ఆత్మబంధువు (పేజీ 60) వ్యాసం, నియో లిబరిజం దేశానికి తీరని అన్యాయం చేసింది అంటారు (పేజీ 72). తెలంగాణలో పునర్నిర్మాణం అనే స్వప్నం లేకపోవడంతో దెబ్బలు తిని, త్యాగాలు చేసినవాళ్లు ఏమీ లేకుండా పోయారు (పేజీ 82) అంటారు. ‘తెలంగాణ అస్తిత్వం ఏమైంది’ అనే వ్యాసంలో ప్రజాసంఘాల మీద నిషేధంపై ముఖ్యమంత్రి కిలేభి (పేజీ 97), కరోనా నేర్పుతున్న కఠిన పాఠాలు, భారత్‌ బంద్‌ (27-9-2021) లాంటి వ్యాసాలు గతకాలం చరిత్రకు అద్దంగా, రాజకీయ అవగాహన కల్పిస్తాయి. రాజకీయ కార్యకర్తలకు చక్కటి కరదీపిక.