– కేంద్ర విధానాలతో మధ్యతరగతి కుటుంబాలు అతలాకుతలం
– ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి:రౌండ్‌టేబుల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న జరిగే గ్రామీణ బంద్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎం కోదండరెడ్డి తెలిపారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల శ్రామికుల నిజ వేతనాలు 20శాతం తగ్గాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ.యూసుఫ్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్త సమ్మె, గ్రామణ బంద్‌కు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ, తెలుగుదేశం, ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎస్‌యూసీఐ, సీపీఐ(ఎంఎల్) తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. మోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్టస్థాయికి చేరాయని తెలిపారు. వారికి లక్షల కోట్ల బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని వివరించారు. మరో పక్క పేదల ఆదాయం భారీగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మోడీ విధానాల వల్ల మధ్య తరగతి ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు కనీవిని ఎరుగని రీతిలో పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చుక్క రాములు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం.. ‘భారత్ వెలిగిపోతోంది, అచ్చేదిన్ ఆయేగా, విశ్వగురు, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలిస్దూ ప్రజతను మభ్యపెడుతోందని విమర్శించారు. నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి పతనమైందని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం సమ్మె హక్కును కాలరాస్తున్నదని వాపోయారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తిరిగి 12 గంటల పని విధానాన్ని అమల్లోకి తెస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు చలపతిరావు, తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర నాయకులు ఎంకె.బోస్, ఎండీ యూసుఫ్, ఐఎన్‌టీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు నాగన్న గౌడ్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పాల్గొన్నారు.
16న గ్రామీణ భారత్ బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రజాసంఘాల ఐక్యకార్యచరణ కమిటీ నేతలు
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ… 16న గ్రామీణ భారత్ బంద్,సమ్మె నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో సంబంధిత పోస్టర్‌ను ప్రజాసంఘాల ఐక్యకార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు ఆవిష్కరించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), కార్మిక సంఘాల పిలుపులో భాగంగా రాష్ట్రంలో బంద్, సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర నాయకులు జె. వెంకటేష్, ఎస్వీ రమ, రాజారావు, శ్రీకాంత్, సుధాకర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్‌రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు పైళ్ళ ఆశయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేశ్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్, టి. సాగర్, ఆర్ వెంకట్‌రాములు మాట్లాడుతూ దేశవ్యాప్త ఉద్యమంలో కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.