– ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి వెనుకాడం
– 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్ల
– అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
– ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
– రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
– మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలు
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,018 కోట్లు
– సాగుచేసేటోళ్లకే రైతు బంధు ఇస్తాం
– విద్యా, వైద్య రంగాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం : బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
‘2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. శాసన మండలిలో అసెంబ్లీ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతిపాదించి ప్రసంగించారు. శాసనసభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతనే రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించామన్నారు. కొంచెం అయిష్టంగానే దీన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యమే తమ బడ్జెట్ లక్ష్యమని నొక్కిచెప్పారు. ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, సమగ్రాభివృద్ధి సాధిస్తామన్నారు. గత పాలకులు ఓ ప్రణాళిక, హేతుబద్ధత లేకుండా ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించారనీ, వారు చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాలుగా మారాయని చెప్పారు. అయినా, తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, సహేతుంగా సవాళ్లను అధిగమిస్తుందని హామీనిచ్చారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వేచ్ఛా తెలంగాణలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు ఆనందంగా ఉందనీ, అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసానిచ్చారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే తమ కృతనిశ్చయమన్నారు.
వాస్తవాలకు దూరంగా గత ప్రభుత్వ బడ్జెట్
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందనీ, రాబడిని అధికంగా చూపెట్టి ఎన్నో పథకాలకు నిధులు కేటాయిస్తున్నామని భ్రమలు కల్పించిందని విక్రమార్క విమర్శించారు. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు చూపెట్టి పైసా కూడా ఖర్చుపెట్టలేదనీ, 2021-22 సంవత్సరానికి కాగ్ లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి డిమాండ్‌లోని రూ.4,874 కోట్లను ఖర్చుచేయలేదని వివరించారు. రైతులకు వడ్డీలేని రుణాల కోసం 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు రూ.1067 కోట్లను బడ్జెట్లో చూపెట్టి కేవలం రూ.297 కోట్లను మాత్రమే ఖర్చుపెట్టిన తీరును ఎత్తిచూపారు. వెనుకబడిన తరగలకు రూ.1,437 కోట్లు, గిరిజనుల అభివృద్ధిలో రూ.2,918 కోట్లను ఖర్చే చేయలేదని తెలిపారు. 2014-15 నుంచి 2023-24 వరకు మహిళలకు బడ్జెట్లో రూ.7848 కోట్లు చూపెట్టి కేవలం 2,685 కోట్లనే ఖర్చుచేశారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల కోసం గొప్పలు చెప్పుకోవడానికే పథకాలను చూపెట్టారనీ, వాటికి నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.
ఆర్థిక వృద్ధి ఇలా..
2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ ప్రస్తుత ధరల్లో 2022-23తో పోలిస్తే రూ.13,02,371 కోట్ల నుంచి రూ.14,49,708 కోట్లకు పెరిగిందనీ, అదే కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 14.7 శాతం నుంచి 11.3 శాతానికి క్షీణిస్తే దేశీయస్థాయిలో అది 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయిందని భట్టి తెలిపారు. దేశ జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు 2.4 శాతం ఎక్కువని చెప్పారు. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు తీవ్ర క్షీణతను చవిచూసిందని గణాంకాలను చూస్తే అర్థమవుతున్నదన్నారు. తెలంగాణలో అధిక ద్రవ్యోల్బణం రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని తెలిపారు. రంగాల వారీగా చూస్తే వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల ఆలస్యం వల్ల వ్యవసాయ వృద్ధిరేటులో క్షీణత కనిపిస్తున్నదని చెప్పారు. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వాణిజ్యం, సేవారంగాల్లో కూడా తగ్గుదల కనిపించిందని వివరించారు. ఒక్క తయారీ రంగంలో మాత్రం వృద్ధి రేటు పెరిగిందని చెప్పారు. 2023-24లో తలసరి ఆదాయం రూ.3,43,297 ఉండొచ్చని తమ అంచనా అన్నారు.
సుపరిపాలన..అభయహస్తం
మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగానే తమ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నదని భట్టి తెలిపారు. ప్రజావాణిని సక్రమంగా నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించామనీ, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరు గ్యారంటీల కోసం 1.29 కోట్ల దరఖాస్తులు అందాయనీ, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వాటిని క్రోడీకరిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేశామన్నారు. ఆసత్రుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవద్దనే ఉద్దేశంతో పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేశామని చెప్పారు. త్వరలో తగిన విధివిధానాలు రూపొందించి గృహజ్యోతి కింద రూ.500 వంటగ్యాస్ సిలిండర్‌ను సరఫరా చేస్తామనీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీనిచ్చారు. మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని నొక్కిచెప్పారు. ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో రూ.53,196 కోట్లు కేటాయింపులు చేస్తున్నామని ప్రకటించారు.
పారిశ్రామికాభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగు
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనీ, ఈ నేపథ్యంలోనే పరిశ్రమల శాఖకు 2,543 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నామని భట్టి చెప్పారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొనటం వల్ల రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. చిన్న, సూక్ష్మ సంస్థలను స్థాపించడానికి వీలుగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర నిధులతో పాటు ఎమ్ఎస్ఈసీడీపీ పథకం ద్వారా నిధులను సమీకరిస్తామనీ, పీఎం మిత్ర నిధులను ఉపయోగించుకుని కాకతీయ టెక్స్టైల్ విస్తరిస్తామని తెలిపారు. ప్రాంతీయ, ఆర్థిక అసమానతలు తలెత్తకుండా రాష్ట్ర నలుమూలలా ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామనీ, ఐటీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ఓ విధానాన్ని తీసుకొచ్చేందుకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఐటీ శాఖకు ఈ బడ్జెట్లో 774 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు.
గ్రామమే యూనిట్‌గా అభివృద్ధి
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్తామని భట్టి విక్రమార్క చెప్పారు. స్థానిక నీటి వనరులను నిర్లక్ష్యం చేసి ఎక్కడ నుంచో నీరు తేవడం అనేది వృథా ప్రయాస అనీ, దీని ద్వారా కాంట్రాక్టర్లు లాభపడ్డారే తప్ప ప్రజలకు నేటికీ సురక్షిత నీరు అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మిషన్‌భగీరథలో దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్ర నికర సొంత పన్నుల ఆదాయంలో 11 శాతం నిధులను గ్రామీణ, పట్టణ సంస్థలకే కేటాయించాలని చేసిన సిఫారసును గత ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. 11శాతంలో 61 శాతం గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలకు కేటాయించాలనే సిఫారసును పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం ఆ సిఫారసులను అమలు చేస్తుందనీ, దాని ప్రకారమే నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.40,080 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. దాని కోసం వెయ్యి కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా భావించి పట్టణ జోన్, పెరిఅర్బన్ జోన్, గ్రామీణ జోన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.
రుణమాఫీ అమలు చేస్తాం..కౌలు రైతులకూ సాయం అందిస్తాం
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేసితీరుతామని భట్టి నొక్కి చెప్పారు. రైతుబంధు పథకాన్ని పున:సమీక్షించి అర్హులైన సాగుచేసే రైతులకు రూ.15వేల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. కౌలు రైతులకూ రైతు భరోసా సాయం అందిస్తామన్నారు. ఫసల్‌బీమా యోజన పథకాన్ని ఆధారంగా చేసుకుని పంటల బీమా పథకాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. రైతుబీమా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు త్వరలోనే నూతన విత్తన విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు. ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఎస్సీ సంక్షేమం కోసం రూ.21,874 కోట్లు..ఎస్టీ సంక్షేమం కోసం 13,313కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ.2,262 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.8 వేల కోట్లు ప్రతిపాదించామని మంత్రి భట్టి తెలిపారు. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1000 కోట్లు, ఎస్టీ గురుకులాల భవన నిర్మాణానికి రూ.250 కోట్లు ప్రతిపాదించామన్నారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా నూతనంగా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించామన్నారు. గురుకులాల్లో బోధనా సిబ్బంది నియామకాలు త్వరలో పూర్తి చేయబోతున్నామన్నారు. బీసీ గురుకులా సొంత భవనాల కోసం 1546 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. సాంప్రదాయ వృత్తుల్లో కొనసాగుతున్నవారికి సాంకేతిక శిక్షణ ఇప్పిస్తామనీ, వారి ఉత్పత్తులు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చారు.
విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట
తెలంగాణను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్షిపులను సకాలంలో అందిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామనీ, దీనికి బడ్జెట్లో రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఉన్నతవిద్యామండలిని ప్రక్షాళన చేసి ప్రమాణాలను మెరుగుపరుస్తామనీ, దీని కోసం రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. 65 ఐటీఐలకు ప్రయివేటు సంస్థల భాగస్వామ్యంతో బృహత్తరమైన ప్రణాళికను అమలు చేస్తామన్నారు. వేరే రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేసి ఐటీఐలలో కొత్త కోర్సులను తీసుకొచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ముందడుగు వేశామన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్లో విద్యారంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు. వైద్యరంగానికి ఈ బడ్జెట్లో రూ.11,500 కోట్లను ప్రతిపాదించామన్నారు. నిమ్స్‌ను విస్తరిస్తామనీ, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం కడుతామనీ, అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ, ఇతర ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను పూర్తిచేస్తామని హామీనిచ్చారు.
టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్లను ఇప్పటికే మంజూరు చేశామనీ, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అది పనిచేస్తుందని మంత్రి విక్రమార్క తెలిపారు. తర్వలో 15 వేల కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ పూర్తిచేస్తామనీ, గ్రూపు-1కి మరో 64 పోస్టులను అదనంగా చేర్చి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులకు అందించే సాయాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత పథకం కింద రూ.5 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేస్తామన్నారు. స్కూలు విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫారాలను చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. గృహజ్యోతి పథకానికి బడ్జెట్లో రూ.2,418 కోట్లను, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు ఈ బడ్జెట్లో రూ.16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.7,740 కోట్లు
ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నామనీ, ఈ పథకానికి బడ్జెట్లో రూ.7,740 కోట్లను ప్రతిపాదిస్తున్నామని మంత్రి విక్రమార్క తెలిపారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ కనెక్టివిటీని అభివృద్ధి పరిచేందుకు తమ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీనికి ప్రాధ్యాతన ఇస్తామని చెప్పారు.
నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు
ప్రస్తుత బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారిందని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం ఎంత వరకైనా పోయి కొట్లాడుతామని నొక్కి చెప్పారు. డాక్టర బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్లను పూర్తిచేసి ఎగువప్రాంతాలైన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు నీళ్లు అందిస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ది చేకూరే ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని వివరించారు. దేవాదాయ భూములను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖతో కలిసి టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకొస్తామన్నారు. గద్దర్ పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అవార్డును అందించబోతున్నామన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కేటాయింపులు ఇలా…
– ఓటాన్ అకౌంట్ బడ్జెట్ – రూ.2,75,891 కోట్లు
– రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
– మూలధన వ్యయం రూ.29,669 కోట్లు
– ద్రవ్య లోటు రూ.32,557 కోట్లు
– రెవెన్యూ మిగులు రూ. 5,944 కోట్లు
శాఖల వారీగా..
– ఆరు గ్యారెంటీలు రూ.53,196 కోట్లు (అంచనా)
– ఎస్సీ సంక్షేమం రూ.21,874 కోట్లు
– బీసీ సంక్షేమం రూ.8,000 కోట్లు
– ఎస్టీ సంక్షేమం రూ.13,313 కోట్లు
– మైనార్టీ సంక్షేమం రూ.2,262 కోట్లు
– మైనార్టీ సంక్షేమం రూ.2,262 కోట్లు
– గృహ నిర్మాణ రంగం రూ.7,740 కోట్లు
– మూసీ సుందరీకరణ రూ. 1,000 కోట్లు
– వైద్య రంగం రూ.500 కోట్లు
– విద్యా రంగం రూ. 21,389 కోట్లు
– తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు రూ.500 కోట్లు.
– యూనివర్సిటీల్లో సదుపాయాలు రూ.500 కోట్లు.
– పంచాయితీరాజ్ రూ.40,080 కోట్లు
– వ్యవసాయం రూ.19,746 కోట్లు
– నీటి పారుదల రంగం రూ.28.024 కోట్లు
– మున్సిపల్ శాఖ రూ.1,692 కోట్లు
– విద్యుత్ (గృహజ్యోతి పథకం) రూ.2,418 కోట్లు
– ఐటీ శాఖ రూ. 774 కోట్లు
– పరిశ్రమల శాఖ రూ.2,543 కోట్లు
– విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు
– తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూ. 40 కోట్లు