పాక్‌లో అనిశ్చితి

పాక్‌లో అనిశ్చితి– మేం లేకుండా సంకీర్ణం సాధ్యం కాదన్న పీపీపీ
– తామే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామంటున్న పీటీఐ, పీఎంఎల్‌ఎన్‌
ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఏ పార్టీకి ఆ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశాలు వున్నాయంటూ చెప్పుకుంటోంది. కాగా ఇంకా తుది ఫలితాలు పూర్తిగా వెలువడలేదు. పోలింగ్‌ ముగిసి 48గంటలు గడిచినా ఇంకా పది సీట్ల ఫలితాలు రావాల్సి వుంది. ప్రస్తుతానికి ఇమ్రాన్‌ పార్టీ పీటీఐకి 96 సీట్లు రాగా, నవాజ్‌షరీఫ్‌కి చెందిన పీఎంఎల్‌-ఎన్‌కు 75సీట్లు లభించాయి. పీపీపీకి 54 సీట్లు రాగా, ఇతరులకు 31 వచ్చాయి. జైల్లో వున్న ఇమ్రాన్‌ ఖాన్‌, అటు ఆయన ప్రత్యర్ధి నవాజ్‌ షరీఫ్‌లు ఇరువురు ఈ ఎన్నికల్లో తామే విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. ఇదిలావుండగా, తమ పార్టీ లేకుండా ఫెడరల్‌ ప్రభుత్వం, పంజాబ్‌, బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పీపీపీ నేత బిల్వాల్‌ చెబుతున్నారు.
లండన్‌ ఫ్లాన్‌ ఫెయిల్‌ : ఇమ్రాన్‌
ఎన్నికల ఫలితాలు తారుమారవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పీటీఐ మద్దతుదారులు పెషావర్‌లోని తాత్కాలిక ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వెలుపల నిరసనలకు దిగారు. మొబైల్‌ సర్వీసులను నిషేధించడం సిగ్గు చేటైన విషయమని పీటీఐ విమర్శించింది. అర్ధరాత్రికల్లా మొత్తం ఫలితాలు ప్రకటించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఫలితాలను సకాలంలో ప్రకటించే రాజ్యాంగబద్ధమైన పాత్రను నిర్వర్తించడంలో పాక్‌ ఎన్నికల కమిషన్‌ విఫలమైందని విమర్శించింది. కేంద్రంలోనూ, పంజాబ్‌, ఖైబర్‌ ప్రావిన్స్‌ల్లో తామే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. జైలు నుండే పీటీఐ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన ఎఐ వాయిస్‌తో చేసిన విజయోత్సవ ప్రసంగం ఆడియో క్లిప్‌ను ఎక్స్‌లో విడుదల చేశారు. నవాజ్‌ షరీఫ్‌ అమలు చేయాలనుకున్న లండన్‌ ప్లాన్‌ విఫలమైందని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ప్రజాస్వామ్య ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొన్నారని అన్నారు.
పాక్‌ ఎన్నికలపై దర్యాప్తుకు అమెరికా, బ్రిటన్‌, ఈయూ విజ్ఞప్తి
పాక్‌ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు, మోసం జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మొత్తంగా ఆ ఎన్నికల ప్రక్రియపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం వుందని అమెరికా, బ్రిటన్‌, యురోపియన్‌ యూనియన్‌లు పిలుపిచ్చాయి. పాక్‌లో పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అందరికీ సమానమైన అవకాశాలు, పరిస్థితులు లేకపోవడంతో కొంతమంది రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారని ఇయు పేర్కొంది. పైగా ప్రజల కదలికలపై ఆంక్షలు, ఇంటర్‌నెట్‌పై, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. అనవసరమైన ఆంక్షలు విధించారని, మీడియా సిబ్బందిపై దాడులు, హింస చోటు చేసుకుందని అమెరికా విదేశాంగ శాఖ విమర్శించింది.