‘మన ఊరు మనబడి’ పథకానికి నిధుల గండం..?

– బిల్లులు రాక అప్పులు తీరక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టర్లు..
– ఇప్పటికే చేసిన పనులకు అందని బిల్లులు..
– రోజుల తరబడి కలెక్టర్ లాగిన్లోనే ఫైళ్లు..
– అధికారుల చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మన ఊరు- మనబడి పథకం కింద పలు పాఠశాలల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆర్థికఇబ్బందులు తప్పడం లేదు.చేపట్టిన పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు రాకచేసిన అప్పులు కుప్పలుగా పేరుకు పోతుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. చిన్నచిన్న బిల్లుల కోసం విద్యాశాఖాధికారి, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకంలో భాగంగా జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా దీనిలో కార్పొరేట్ కు దీటుగా  తీర్చి దిద్దడానికి 329 ప్రభుత్వ పాఠశాలలను నిర్ణయించారు. ఈ మేరకు రూ.117.31 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదనపు తరగతి గదులు, ప్రహరీలు, భవనాలకు రంగులతో పాటు ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, డైనింగ్ హాల్, కిచెన్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు 49 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. బహిరంగ మార్కెట్లో మెటీరియల్ ధరలకు ఇంజినీర్లు రూపొందించిన అంచనాలకు పొంతన లేకపోవడంతో పనులు చేసేందుకు మొదట్లో కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. దీంతో మెజార్టీ పాఠశాలల్లోని పనులను ఆయా గ్రామాల సర్పంచులు, పాఠశాల కమిటీ సభ్యులే చేపట్టారు. కొంతమంది అప్పు చేసి పనులు చేపట్టగా, మరికొంత మందిస్థానికంగా ఉన్న డీలర్ల వద్ద ఖాతా పద్ధతిలోమెటీరియల్ తీసుకొచ్చారు. పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా.ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందిపడాల్సి వస్తోంది.
ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు: మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో  మొదటి విడతలో 950 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించగా వీటిలో 329 పాఠశాల లకు రూ.117.3 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. రూ.27.23 లక్షలకు లోబడి ఉన్న 99 పాఠ శాలల్లో ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేప ట్టగా, వీటిలో ప్రస్తుతం 27 పాఠశాలల్లో పనులు పూర్తి చేశారు. మిగిలిన వాటిలో ఇప్పటికీ కొనసాగు తూనే ఉన్నాయి. రూ.27.23 లక్షలకుపైగా అంచనా వ్య యంతో టెండర్ ద్వారా పనులు చేపట్టారు. ధరలు గిట్టుబాటు కాకపోవడంతో ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. కొన్నిచోట్ల ప్రారంభమైనా.. మెజార్టీ పాఠశాలల్లో పెండింగ్ లోనే ఉన్నాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాని ప్రాంతాల్లో ఏ విధంగా పనులు చేపట్టాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతుండగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం. కోడ్ కారణంగా కొత్త పనుల ప్రారంభం నిలిచిపోవడం. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం. ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాని పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. పేరుకుపోయిన బిల్లులు చెల్లిస్తే కానీ కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో మౌలిక సదుపాయాల లేమితో ఆయా పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.