సహజమైనవి కొన్ని
అరువు తెచ్చుకున్నవి కొన్ని
అవసరాలు ఏర్పరిచినవి కొన్ని
అనుకోకుండా కొన్ని
రకరకాల బంధాలు అనుబంధాల అల్లికలే అవన్నీ
చల్లటి గాలిలా తడిమిపోతుంటాయి
వడగాడ్పులా వచ్చిపోతూ ఉంటాయి
తుఫానులా ముసురుకొని మూసీలో కలుస్తుంటాయి
అన్నీ బంధాలే అనుబంధాలే
మనిషిలోని సాలె పురుగు తత్వానికి
మచ్చుతునకలు అన్నీ
గూడు చెదిరిందా! గుర్తులు లేకుండా పోతాయి
కాలప్రవాహంలో కాగితపు పడవల్లా కరిగిపోతుంటాయి
ఎన్ని ఉన్నాయి? ఎన్ని పోయాయి?
మిగులెంత? తరుగెంత?
అనే అంకగణితమంతా బేతాళ మాయ
దైనందిన జీవితంలో
బతుకుదారిలో పచ్చి నిజాన్ని వెతుకులాడితే
అడుగడుగునా ఎదురుపడే
తట్టురాళ్ల నుండి బండరాళ్ల నుండి
అగ్నిశిఖల నుండినువ్వు ఎవరో తెలవకున్నా
నిన్ను నిన్నులా గుర్తించి
నిన్ను తప్పించే నిన్ను పైకి లాగే
మాటగానో! చేతగానో!
తోడ్పాటునందించే సాటి మనిషితో
అప్రయత్నంగా అనుకోకుండా నిస్వార్ధంగా
స్వచ్ఛమైన మట్టి వాసనలా
పరిమళించేదే అసలైన బంధం
అది క్షణకాలం అయితే ఏంటి?
దాని ముందు ఎన్ని బంధాలైనా అనుబంధాలైనా
దిగదుడుపే!
– డా||ఉప్పల పద్మ, 9959126682