– మేకిన్ ఇండియా పేరుతో మోసం
– బీజేపీ కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటించాలి : కార్మిక సంఘాల సదస్సులో సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– ఐఎస్ సదన్ చౌరస్తా వరకు ర్యాలీ, మానవహారం
నవతెలంగాణ-ధూల్‌పేట్
కేంద్రంలోని మోడీ సర్కార్ అచ్చేదిన్ ఆయేగా అంటూ ప్రజలను మోసం చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఆదివారం సంతోష్‌నగర్‌లోని సీఐటీయూ హైదరబాద్ సౌత్ జిల్లా కార్యాలయంలో సీఐటీయూ, ఏఐటీయుసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. అదేవిధంగా ఐఎస్ సదన్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. సమ్మె సన్నాహకం కోసం బైక్ ర్యాలీకి 10 రోజుల కిందటే దరఖాస్తు చేసుకుంటే చివరి నిమిషంలో రద్దు చేయడంతో నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి ఐఎస్ సదన్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సదస్సులో భాస్కర్ మాట్లాడుతూ.. ఈ నెల 16న నిర్వహించే సమ్మెలో నగరంలోని వివిధ రంగాల కార్మికులు భాగస్వాములు కావాలన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలన్నారు. పదేండ్ల కాలంలో రైతాంగ, కార్మిక, ప్రజల సమస్యలు పరిష్కరించలేదన్నారు. భారత్ వెలుగు పోతుంది.. అచ్చేదిన్ ఆయేగా.. ఆత్మ నిర్భయ భారత్, విశ్వగురు, మేకిన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. 30 నుంచి 56శాతం ధరలు పెరిగాయని, పెట్రోలు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను 243శాతం పెంచిందన్నారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతలంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సహజ వనరులను కార్పొరేట్ల పరం చేస్తున్నదన్నారు. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలలో 100శాతం వాటాలను తెగ నమ్ముతున్నదన్నారు. నేషనల్ మానిటైజేషన్‌పైప్లైన్ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజుల పేరుతో ప్రయివేటీకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు మార్చి వాటి స్థానంలో కార్మిక కోడ్‌లను తీసుకొచ్చిందని చెప్పారు. తిరిగి 12 గంటల పని దినాన్ని అమలులోకి తీసుకరావడానికి కుట్రలు చేస్తోందన్నారు. కాంట్రాక్ట్ లేబర్ విధానాన్ని అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడీకి గురిచేస్తుందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె పారిశ్రామిక బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రావణ కుమార్ కోరారు.
ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.యాదగిరి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని, అందులో పొందుపరిచిన లౌకికవాదాన్ని తారుమారు చేస్తూ హిందూ రాజ్యస్థాపన లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ధరలు పెరుగుదల, పేదరికం, ఆకలి మొదలైన కీలక అంశాలను ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని మతతత్వ శక్తులు రామాలయం ప్రారంభోత్సవం, అక్షింతల కార్యక్రమాలతో ముందుకొచ్చారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు, నాయకులు విఠల్, జంగయ్య, కోటయ్య, రామ్ కుమార్, ఎస్ కిషన్, సురేష్, బాబర్ ఖాన్, సరూప, నాగేశ్వరరావు, సలీం, గౌస్, ఖదీర్, ఇస్మాయిల్, జంగయ్య, బి కిషన్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.