– రంగుల చిత్రకళతో అద్భుతాల సృష్టికర్త
తిరువనంతపురం: ప్రఖ్యాత చిత్రకారుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎ.రామచంద్రన్ (89) సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు రాహుల్ తెలిపారు. కేరళలో జన్మించిన రామచంద్రన్ రంగుల చిత్రకళతో అద్భుతాలు సృష్టించారు. 2005లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. గ్రామీణ జీవితం, పురాణాల ప్రభావంతో రామచంద్రన్ చిత్రాలు ప్రపంచఖ్యాతి పొందాయని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా నివాళులు అర్పించారు. అంతర్జాతీయ కళాకారుడైన రామచంద్రన్ ఆధునిక చిత్రకళను ఔపోసన పట్టి, అందులోని పోకడలపై పలు వ్యాసాలు రాశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.