– వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ
– కుటుంబ సభ్యుల ఆందోళన
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరంలోని లుంబిని ఆస్పత్రిలో ప్రసవానంతరం ఓ శిశువు ఆదివారం చనిపోయింది. తల్లి గర్భంలో శిశువు మెడకు పేగు పెనవేసుకుని ఉంటే ఆపరేషన్ చేసి ప్రాణం పోయకుండా ఖమ్మంలోని వైద్యులు సాధారణ ప్రసవం పేరుతో జాప్యం చేయడంతో శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. ఖమ్మంరూరల్ మండలం గుర్రాలపాడుకు చెందిన శ్రీదేవి, యాకన్న దంపతులకు 5 ఏండ్ల తర్వాత సంతానం అందింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రీదేవికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లుంబిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆ సమయంలో వైద్యురాలు లేకపోవడంతో నర్స్ ఫస్ట్‌ఎయిడ్ చేసింది. డాక్టర్‌కు గర్భిణీ పరిస్థితి తెలిపారు. డాక్టర్ రావడం ఆలస్యం కావడంతో నర్స్నే ప్రసవం చేసింది. అయితే, శిశువు పల్స్ పడిపోయినా నర్స్ విషయం చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత శిశువు మృతిచెందిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. శిశువు మృతికి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ శ్రీదేవి సోదరుడు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డగించారు.