– ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ హింసలో మరో 25 మంది అరెస్టయ్యారు. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈనెల 8న హల్ద్వానీలో స్థానిక అధికార యంత్రాంగం ఒక మసీదు, మదర్సాను కూల్చివేసిన తరువాత హింస చెలరేగిన విషయం విధితమే. అరెస్టయినవారిలో 12 మంది పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారనీ, ఆరుగురు పోలీస్ స్టేషన్ వెలుపల కార్లను తగులబెట్టారనీ, ఏడుగురు కూల్చివేత సమయంలో హింసలో పాల్గొన్నారని పోలీసులు ఆరోపించారు. హింసాకాండకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 30 మందిని అరెస్టు చేసినట్టు నైనిటాల్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు మూడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని చెప్పారు.