న్యూఢిల్లీ : మారుతి సుజుకి కొత్తగా ఎగిరే కార్లను అభివృద్థి చేయనున్నట్లు ప్రకటించింది. జపాన్‌కు చెందిన మాతృసంస్థ సుజుకితో కలిసి ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు’ డెవలప్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు పేర్కొంది. దీనిలో పైలట్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చని సమాచారం. డ్రోన్ల కంటే పెద్దగా, సంప్రదాయ హెలికాప్టర్ల కంటే చిన్నగా ఉండే ఈ చాప్టర్లకు మారుతి సుజుకి స్కై డ్రైవ్ పేరును పెట్టనుంది. 1.4 టన్నుల తేలికపాటి బరువు ఉండటంతో ఇళ్లపైనా కూడా వీటిని ల్యాండింగ్, టేకాప్ చేయవచ్చని తెలిపింది. రోడ్డు మార్గంలో ఉబెర్, ఓలా క్యాబ్ సర్వీసుల మాదిరిగానే మారుతి సుజుకి ఈ చాప్టర్లను ఎయిర్ టాక్సీలుగా వినియోగించాలని భావిస్తోన్నామని సుజుకి మోటార్ గ్లోబల్ ఆటోమొబైల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ కెంటో ఒగురా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. భారత్‌లో వినియోగానికి గల అవకాశాలు, వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అనుమతించాలని కోరుతూ విమానయాన రంగ నియంత్రణ సంస్థ డిజిసిఎతో సంప్రదింపులు చేస్తున్నామని ఒగురా తెలిపారు.