అడుగడుగునా నిర్బంధం

 Constraint at every step–  ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణొం పలు రాష్ట్రాల నుండి ‘ఢిల్లీ ఛలో’కు అన్నదాతలు
– అరెస్టులతో అడ్డుకుంటున్న పోలీసులు
– సరిహద్దుల మూసివేత
– రాజధానిలో నెల రోజుల పాటు సెక్షన్‌ 144 విధింపు
న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి. ఎక్కడ చూసినా రైతన్నలపై నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కన్పిస్తోంది. రైతులను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఢిల్లీ పోలీసులు రాజధానిలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. ప్రదర్శనలు, సమా వేశాలను ఏకంగా నెల రోజుల పాటు నిషేధించారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుండే అమలులోకి వచ్చాయి. మార్చి 12వ తేదీ వరకూ అమలులో  ఉంటాయి. ప్రజా రవాణా వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదు. ఎవరూ ఆయుధాలు ధరించి తిరగకూడదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో ప్రమాదకరమైన వస్తువులతో తిరగడాన్ని కూడా నిషేధించారు. అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్లను వాడకూదదని చెప్పారు. రెచ్చగొట్టేలా సందేశాలను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హుకుం జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు మాత్రం ఇవేవీ వర్తించవు. పోలీసులు జారీ చేసిన ఆదేశాల ప్రకారం…రోడ్లను దిగ్బంధించకూడదు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదు. ప్రదర్శనలు నిర్వహించడం, వాటిలో పాల్గొనడం నేరం. సరిహద్దు జిల్లాల నుండి రాజధానికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కర్రలు, బ్యానర్లు వంటి వస్తువులతో సంచరించడాన్ని పూర్తిగా నిషేధించారు. వివాహాలు, అంత్యక్రియలు, ఇతర మతపరమైన కార్యక్రమాల కోసం సంబంధిత అధికారుల నుండి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీకి తరలి వచ్చే రైతులను అడ్డుకునేందుకు తిక్రి సరిహద్దు మెట్రో స్టేషన్‌ సమీపంలో ఐదంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. సింఘు, ఘాజీపూర్‌ సరిహద్దుల వద్ద కూడా పోలీసులు జాతీయ రహదారులను మూసేశారు. రాజధాని సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించారు. సరిహద్దుల వద్ద నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అనేక చోట్ల ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఢిల్లీ వెళుతున్న కర్నాటక రైతులను భోపాల్‌లో అరెస్ట్‌ చేయడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. పలు రాష్ట్రాల నుండి రాజధాని వైపు వస్తున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నట్లు వార్తలందుతున్నాయి. ఓ వైపు రైతులతో చర్చలు జరుపుతామని చెబుతూనే మరోవైపు వారిని అరెస్ట్‌ చేస్తున్నారని, అలాంటప్పుడు సంప్రదింపులు ఎలా సాధ్యమని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అంబాలా, జింద్‌, ఫతేహాబాద్‌, కురుక్షేత్ర వద్ద పంజాబ్‌తో ఉన్న సరిహద్దులను హర్యానా ఇప్పటికే మూసేసింది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 144వ సెక్షన్‌ విధించింది. ఇదిలావుండగా ఢిల్లీ ఛలో కార్యక్రమంలో పాల్గొనేందుకు పంజాబ్‌ నుండి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్‌ ట్రాలీలు బయలుదేరాయి. ఈ ఆందోళనలో 200కు పైగా రైతు సంఘాలు భాగస్వాములవుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తామన్న హామీకి చట్టబద్ధత కల్పించాలని రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు.