వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషిం చారు. ఈ చిత్రం ఈనెల 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, ‘రైతులు స్వచ్చందంగా ఇన్ని వేల ఎకరాల భూములు ఇస్తే దానిని హేళన చేస్తూ, వాళ్ళని క్షోభకిగురి చేసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానిని స్ఫూర్తిగా తీసుకొని రైతుల పక్షాన ఒక సినిమా తీయాలని అనుకున్నాం. ఈ సినిమా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మాకు కనిపించిందల్లా రైతుల కళ్ళలో కన్నీళ్లు. ఆ కన్నీళ్లకు సమాధానంగా, కన్నీళ్లు తుడిచే విధంగా సమాజాన్ని చైతన్య పరుస్తూ ఒక సామాజిక బాధ్యతగా ఈ సినిమా చేశాం. భాను చాలా అద్భుతంగా తీశాడు. మణిశర్మ చాలా అద్భుతమైన సంగీతం అందించారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక తరంలో ఒక రైతు ఉంటాడు. అందరూ ఒక బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని ఆదరించి రైతు కుటుంబాలని ఆదరించాలని కోరుతున్నాను’ అని తెలిపారు.
‘ఇది పొలిటికల్ సినిమా కాదు. రైతుల అవేదని తెలియజేసే కథ. నేను రైతు పాత్రని పోషించాను. ఇందులో ప్రధాన పాత్రధారులు అమరావతి రైతులు.వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది కంటెంట్ బేస్డ్ స్టొరీ. చాలా మంచి సినిమా అవుతుంది’ అని వినోద్ కుమార్ చెప్పారు.
దర్శకుడు భాను మాట్లాడుతూ,’రవిశంకర్ చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని చూపించే ఈ కథలో నటించడానికి ముందుకు వచ్చిన వినోద్ కుమార్‌కి థ్యాంక్స్. అలాగే వాణీ విశ్వనాథ్. దాదాపు ఏడు వందల రైతుల మధ్య ఈ సినిమా తీశాం. మాది జాతీయ జెండాలాంటి సినిమా. అందరికీ ఉపయోగపడే సినిమా ఇది. ఇది పొలిటికల్ సినిమా కాదు, పబ్లిక్ ఫిల్మ్. రాజధాని రైతుల ఆవేదనని తెలియజేసే ప్రజల సినిమా ఇది. ప్రజల ప్రయోజనం కోసం తీసిన సినిమా ఇది’ అని అన్నారు.