వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు భాను మాట్లాడుతూ, ”అమరావతి ఫైల్స్’ పేరుని ‘రాజధాని ఫైల్స్’గా మార్చాం. సెన్సార్‌కి వెళ్ళినప్పుడు ఫిక్షనల్ చేస్తేనే సెన్సార్ ఇస్తామని చెప్పారు. వారు చెప్పిన కరెక్షన్స్ కూడా చేశాం. ఇది రాజకీయ చిత్రం కాదు. ప్రజల చిత్రమని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ప్రజల ఆవేదనని చూపించే చిత్రమిది. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని నమ్మి తమ భూములు ఇచ్చారు. మరో ప్రభుత్వం వచ్చి వారిపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టింది. ప్రజలు నమ్మింది ప్రభుత్వాన్ని కాని, పార్టీలను కాదు. ఈ అంశాన్నే ఇందులో చూపించబోతున్నాం. ఇది పొలిటికల్ కంటెంట్ కాదు. రైతుల పడిన ఇబ్బందులు, మానసిక సంఘర్షణ, వారిని ఇబ్బంది పెట్టే మనుషులు, న్యాయం కోసం రైతులు చేసిన పోరాటం తప్పితే పొలిటికల్ కోణం ఉండదు. ఇందులో సమస్యకి పరిష్కారం కూడా చూపించాం. ఇది రైతుల కథ. వారి జీవితాల్లోకి వచ్చి ఇబ్బంది పెట్టిన వారి పాత్రలనే తీసుకున్నాం కానీ ఎవరి వ్యక్తిగతాల జోలికి పోలేదు’ అని తెలిపారు.