ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో ఉత్తమ నటనకి అల్లు అర్జున్ జాతీయ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఈ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు నటుడుగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు. అయితే తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని పొందారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు గురువారం జర్మనీకి పయనమయ్యారు. ఇదిలా ఉంటే, ఆయన నటిస్తున్న పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మన దేశ సినీ పరిశ్రమ తరఫున బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక అరుదైన అవకాశం. మన సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేందుకు ఈ ఫెస్టివల్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పుష్ప2తో మీ ముందుకు రాబోతున్నా’ అని అల్లుఅర్జున్ తెలిపారు.