ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలి

ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలి– మృతుని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
– డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌
నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ ఫ్యాక్టరీలలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి.జయరాజ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాశమైలారం పారిశ్రామికవాడలో సీఎంహెచ్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన శ్యాంబాబు కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. గడ్డపోతారం, పాశమైలారం, జిన్నారం, ఖాజిపల్లి, హత్నూర ప్రాంతంలో రెగ్యులర్‌గా ప్రమాదాలు జరుగుతున్నా సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బొల్లారం అమర్‌ కెమికల్‌ పరిశ్రమ, పాశమైలారం మోనాక్షి లైప్‌ సైన్సెస్‌, టైర్ల పరిశ్రమ, జిన్నారం మండలంలో లీఫార్మాలో భారీ ప్రమాదం జరిగినా పట్టించుకోలేదన్నారు. ఫసల్వాది శివారులోని గణపతి ఫ్యాక్టరీలో కార్మికులు ప్రమాదానికి గురై మరణించారని గుర్తు చేశారు. బొర్పట్ల అరవిందోలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మరణిస్తే.. బయటికి పొక్కకుండా చేశారన్నారు. ప్రమాదాలపై స్పందించాల్సిన ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. వీరిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కూడా సరిగ్గా తనిఖీలు చేయడం లేదని విమర్శించారు. పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయన్నారు. కార్మికుల కుటుంబాలను తక్షణమే ఆదుకునే విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ పరమేశంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, జి.సాయిలు, నాయకులు నర్సింహులు, ఎం.యాదగిరి, బాగారెడ్డి, భూషణం, కృష్ణ పాల్గొన్నారు.