– జీరో అవర్‌లో సర్కారుకు
– కొత్త ఎమ్మెల్యేల మొర ప్రత్యేకంగా అవకాశమిచ్చిన స్పీకర్ ప్రసాద్‌కుమార్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం కొత్త ఒరవడికి నాంది పలికాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నూతనంగా ఎన్నికై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో ఆ పార్టీ, ఈ పార్టీ అనే బేధం లేకుండా అందరికీ తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు వీలు కలిగింది. స్పీకర్ ప్రసాద్‌కుమార్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మాట్లాడుతూ కొత్త ఎమ్మల్యేలకు జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నారు. మీ మీ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన సమస్యలను జీరో అవర్‌లో ప్రస్తావించాలని సూచించారు. అవకాశం రాని వారికి శుక్రవారం జీరో అవర్‌లోనూ మీ సమస్యలు మాట్లాడవచ్చని చెప్పారు. ఒక్కో సభ్యుడు ఒక్కో సమస్యను సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు జీరో అవర్ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒక్కొక్కరు రెండు నుంచి ఐదు నిమిషాల వరకు సమయాన్ని వాడుకున్నారు. ఇంకొందరు అదనంగా కూడా మాట్లాడారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో దళితబంధు నిధులు ఆగిపోయాయని అన్నారు. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో టెస్ట్‌లు చేయడానికి కావాల్సిన ఆధునాతన యంత్రపరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పౌరులకు జీహెచ్ఎంసీ అధికారులు బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పారు. ప్రజలు నెలల తరబడి తిరగాల్సి వస్తున్నదన్నారు. లక్ష్మికాంతరావు మాట్లాడుతూ జుక్కల్‌లో సాగునీటిసమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు. లెండి ప్రాజెక్టు చేపట్టి చాలా ఏండ్లు అవుతున్నా, సమస్య పరిష్కారం కాలేదన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా మాకు సాగునీళ్లు అందడం లేదని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయా ? రావా ? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజరు మాట్లాడుతూ డయాబెటిక్ పేషెంట్లు అధికమవుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో డయాలసిస్ యంత్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ నగరంలో నీటికాలుష్యం పెరుగుతున్నదనీ, దీనిమూలంగా ప్రజలకు రోగాలు వస్తున్నాయని చెప్పారు. ఆసమస్యను పరిష్కరించాలని కోరారు. మరో ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ నాంపల్లి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ సర్కారీ అస్పత్రులకు పేదల ప్రజలు వస్తుంటారనీ, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, రాజమణి, ఆది శ్రీనివాస్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లా వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మాణిక్‌రావు, కౌసర్ మొయినోద్దీన్, పాయల్ శంకర్, అనిరుద్‌రెడ్డి, మీర్ జుల్పీకర్అలీ, మందుల సామేల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రామారావు పటేల్, డాక్టర్ సంజరు తదితరులు జీర్అవర్లో మాట్లాడారు. సభ్యుల అడిగిన ప్రశ్నలకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ సభ్యులు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను నోట్ చేసుకున్నామని చెప్పారు.