మేడిగడ్డపై సమగ్ర విచారణ జరపాలిబాధ్యులపై చర్యలు తీసుకోవాలి

A comprehensive inquiry should be conducted on Medigadda and action should be taken against those responsible– కేఆర్‌ఎంబిపై అఖిలపక్షం పెట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ -నల్లగొండ టౌన్‌
మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులను కేటాయించాలన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టును బొందల గడ్డగా మార్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయ్యాయని, గత ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులకు మాత్రమే శంకుస్థాపనలు చేసిందని, కొత్తగా ఏ ఒక్కటీ మంజూరు చేయలేదని చెప్పారు. నల్లగొండ జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో రైతాంగానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. వాస్తవానికి కేసీఆర్‌ నల్లగొండ బహిరంగ సభకు వచ్చేటప్పుడు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రావాల్సిందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగలేదని, ప్రతిపక్ష నాయకులకు సమయం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ, ప్రజల సమస్యలపై చర్చలు నిర్వహించకుండా రచ్చబండగా చేశారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు హూందాగా నడవాలని సూచించారు.
దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే అయోధ్యలోని రామ మందిరాన్ని ముందుకు తెచ్చి దేశవ్యాప్తంగా క్యాంపెయిన్‌ చేస్తూ ప్రజలను సెంటిమెంట్‌తో మోసం చేయాలని చూస్తోందన్నారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2015లో శంకుస్థాపన చేసిన చర్లగూడెం రిజర్వాయర్‌కు సంబంధించి కనీసం భూ నిర్వాసితులకు కూడా పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీరు తీసుకోవాలో కనీసం డీపీఆర్‌ కూడా ప్రభుత్వాలు రూపొందిం చలేదన్నారు. ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టానని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప గత పది సంవత్సరాల కాలంలో జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా కొత్తగా సాగునీరు ఇవ్వలేకపోయారని తెలిపారు.
కేసీఆర్‌ నిన్న జరిగిన బహిరంగ సభలో శుద్ధ అబద్ధాలు మాట్లారని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ ఉన్నారు.