– పంచాయతీ రాజ్, స్త్రీ-శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ – ములుగు
మేడారంను ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులకు సూచించారు. గురువారం మలుగు జిల్లా మేడారంలోని హరిత హౌటల్ సమావేశం మందిరంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో సందర్శకుల తాకిడి పెరుగుతోందన్నారు. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు చూడాలన్నారు. నిరంతరం తాగు నీరు అందించాలని చెప్పారు. జాతర ముగిసిన అనంతరం కూడా ముమ్మరంగా పారిశుధ్య పనులు కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మాట్లాడుతూ.. జాతరలో గద్దెల ప్రాంగణంలో బెల్లం, కొబ్బరికాయలు శుభ్రం చేయాలని, జంపన్న వాగు సమీపంలో తలనీలాలు కూడా శుభ్రం చేయాలని అన్నారు. మిషనరీ యంత్రాల ద్వారా పారిశుధ్య సిబ్బంది నిరంతరం విధులు నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ.. వివిధ జిల్లాల నుంచి జాతర విధులుకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా 19 తేదీన సంబంధిత జోనల్ అధికారులకు రిపోర్ట్ చేయాలని చెప్పారు. జాతరలో పారిశుధ్య పనులు చేయడం కోసం 10 సెక్టార్లు, 60 సబ్ సెక్టార్స్‌గా విభజించామని, డీపీఓ, డీఎల్‌పీఓల ఆధ్వర్యంలో పనులు జరుగుతాయని అన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ.. అధికారులకు కేటాయించిన జోన్‌లలో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి జోన్‌కు ఎంపీఓ స్థాయి అధికారిని కేటాయించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శబరిష్, డీపీఓలు, డీఎల్పీఓ, వివిధ జిల్లాల జోనల్ అధికారులు పాల్గొన్నారు.