– సీఎంగా రేవంత్‌రెడ్డిని చూడలేకనే అసెంబ్లీకి రావట్లేదా..
– అహంభావం మంచిది కాదు : సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు పోటీ చేయాలని, అలాంటి వారిని ఎన్నికల కమిషన్ వెంటనే బహిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో సీపీిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
శాసనసభకు ఎన్నికైన తరువాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా శాసనసభ సమావేశాలను బహిష్కరించిన జయలలిత, జగన్, చంద్రబాబును కేసీఆర్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో అసెంబ్లీ నుంచి తాను గెంటేయించిన ఎ.రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం, తాను ప్రతిపక్ష నేతగా ఏ ముఖంతో ఆయనను చూడాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదేమోనన్నారు. అహంభావం పనికి రాదని, గతంలో అహంభావంతో వ్యవహరించిన ఫలితం ఇప్పుడు కాల్చేస్తున్నదన్నారు. కాళేశ్వరంలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే ఏమవు తుందని కేసీఆర్ అనడం సరికాదని, మేడిగడ్డకు వెళ్లిన ఎమ్మెల్యేల బృందంతో కేసీఆర్ కూడా వెళ్లాల్సిం దని అన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టి రెండు నెలలు కాకముందే బీఆర్‌ఎస్ నేతలు శాపనార్థాలు పెట్టడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి తమకు ప్రభుత్వం అప్పగించాలని ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు చేసిన మాటలపై నారాయణ స్పందించారు. బీఆర్‌ఎస్ నేతలకు మైండ్ దొబ్బిందని, వెంటనే ముఖ్యమంత్రి కావాలనే తపన ఆ వ్యాఖ్యల్లో కనిపిస్తోందన్నారు. ఆ వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.
నల్ల చొక్కాతో నారాయణ నిరసన
ఢిల్లీలో రైతులపై కేంద్ర ప్రభుత్వం అమానుష దౌర్జన్యాన్ని నిరసిస్తూ మీడియా సమావేశానికి నారాయణ నల్ల చొక్కా ధరించి హాజరయ్యారు. కేంద్రంలో ఉన్నది రైతు విద్రోహ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులేమైనా టెర్రరిస్టులా? వాళ్లపై డ్రోన్‌లతో బాష్పవాయువు చల్లడమేమిటని ప్రశ్నించారు. రైతులు ఉద్యమిస్తుంటే మోడీ విదేశా లకు వెళ్ళి రామాలయాలు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్‌లను రద్దు చేయా లని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఢిల్లీలో రైతుల ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ దమన కాండకు నిరసనగా తెలంగాణ శాసన సభ తీర్మానం చేయాలని సూచించారు. పదేండ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం మేడిగడ్డ వద్దకు మార్చడంతో ఆదిలా బాద్‌కు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని, ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హౌదా వచ్చేలా కృషి చేయాలని కోరారు. అనేక ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదని, ఎస్‌ఎల్‌బీ, గౌరెల్లి వంటివి పూర్తి చేయాలని కోరారు.