
– వేల సంఖ్యలో పాల్గొన్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న, పారిశుద్ధ్య కార్మికులు
– రాస్తారోకోలో పాల్గొని మాట్లాడిన ప్రముఖులు
నవతెలంగాణ – ఆమనగల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆమనగల్ పట్టణంలో చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. సమ్మెలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మెను సంపూర్ణంగా కొనసాగించారు. ఈసందర్భంగా స్థానిక శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అదేవిధంగా మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కాన్గుల వెంకటయ్య తదితరులు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల, కార్మికుల, రైతుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. రైతు నల్ల చట్టాలను, లేబర్ కోడ్ లను రద్దు చేసి ఆయా రంగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి పనికి తగ్గ వేతనం అమలు చేయాలని వారు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి స్వస్తి చెప్పాలని, ఆకాశాన్ని అంటుకున్న ధరలను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో గొర్ల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జల్లెల్ల పెంటయ్య, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పిప్పళ్ల శివశంకర్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న, అంగన్వాడీ యూనియన్ ఆధ్యక్షురాలు యాదమ్మ, లట్టుపల్లి సంగీత, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు బీబీ, సల్మా, జ్యోతి, నిర్మల, శిరీష, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు హంసమ్మ, మండల అధ్యక్షుడు విజయ్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు పద్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.