కన్నెర్ర …

Kannera...– కదం తొక్కిన సంపద సృష్టికర్తలు
– డిమాండ్ల సాధనకు బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం
– లోక్‌సభ ఎన్నికలకు ముందు జాతీయ ఎజెండాలో ప్రజల జీవనోపాధి సమస్యలు
– రైతుల ఆత్మహత్యలకు ముగింపు పలికేందుకు ఎంఎస్పీ, రుణమాఫీ చేయాలి
– గ్రామీణ భారత్‌ బంద్‌, సమ్మె సక్సెస్‌
– దేశం అంతటా రైతులు, కార్మికులు, గ్రామీణ ప్రజల ఆందోళన
– దేశంలో 600 పైగా జిల్లాల్లో బంద్‌, సమ్మె : సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సంపదసృష్టికర్తలు కదం తొక్కారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యలు, సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు గ్రామీణ భారత్‌ బంద్‌తో పాటు పారిశ్రామిక, సెక్టోరల్‌ సమ్మె విజయవంతమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ బంద్‌, సమ్మెకు మహిళలు, యువత, విద్యార్థులు, వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం సంఘీభావం తెలిపింది. ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్‌, రచయితలు, మేథావులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ”నేషన్‌ ఫర్‌ ఫార్మర్స్‌” వేదిక ఆధ్వర్యంలో బంద్‌, సమ్మెకు మద్దతు తెలిపారు.
సమ్మె మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తుంది. బీజేపీ నేతృత్వంలోని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్‌లోని శంభు సరిహద్దు వద్ద రైతులపై దాడికి వడిగట్టింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ ఎజెండాలో ప్రజల జీవనోపాధి సమస్యలను తిరిగి తీసుకొచ్చామని రైతు, కార్మిక సంఘాల నేతలు తెలిపారు.పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌, బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, ఓడిశా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, అసోం, త్రిపుర పాండిచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దుకాణాలు, పరిశ్రమలు, మార్కెట్లు, విద్యాసంస్థల్లో నిరసన దాదాపు బంద్‌గా మారగా, గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. భారీ ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. పంజాబ్‌, హర్యానాలో రైల్వే స్టేషన్ల వద్ద ఆందోళనలు జరిగాయి. దీంతో కొన్ని రైళ్లును దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. ఇందులో లక్షలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్మికులు పని నిలిపేసి, భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ వివిధ రాష్ట్రాల్లో బంద్‌ లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని సర్కిళ్లలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు సమ్మెలో భారీగా పాల్గొన్నారు. విద్యార్థులు తరగతులను బహిష్కరించి బంద్‌ లో భాగస్వామ్యం అయ్యారు. యువత, మహిళలు కూడా భారీగా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రెస్‌ కాలనీలో వందలాది మంది యాపిల్‌ రైతులను పోలీసులు, పారా మిలటరీ బలగాలు బలవంతంగా చెదరగొట్టారు. నాయకులను పోలీసు వాహనాల్లోకి లాగారు. ఎటువంటి నోటీసు లేకుండా కస్టడీకి తరలించారు. కాంట్రాక్ట్‌ కార్మికులతో సహా కార్మికుల భారీ సమ్మె కారణంగా కలకత్తా, పారాదీప్‌, టుటికోరిన్‌, విశాఖపట్నం, చెన్నై వంటి దేశంలోని దాదాపు అన్ని ప్రధాన ఓడరేవులలో కార్గో హ్యాండ్లింగ్‌ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ పోర్టుతోపాటు పలు మైనర్‌ పోర్టుల్లో కార్మికులు సమ్మెలో ఉన్నారు.
అసోం, నాగాలాండ్‌, మణిపూర్‌లలో విస్తరించి ఉన్న దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కర్మాగారాలు, మార్కెటింగ్‌ వ్యవస్థలు ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులు, కార్మికుల భారీ సమ్మె కారణంగా దాదాపుగా మూసివేతకు గురయ్యాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు భారీ సమ్మెలో ఉన్నారు. గుజరాత్‌లో అంగన్‌వాడీ ఉద్యోగులు, ఆశాలు తమ రెండు రోజుల సమ్మెను ప్రారంభించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి, తిరుమయం, రాణిపేట్‌లోని బీహెచ్‌ఈఎల్‌ ప్లాంట్లు దాదాపు పూర్తి సమ్మెలో ఉన్నాయి. విశాఖపట్నంలోని బీహెచ్‌ఈఎల్‌ పాక్షిక సమ్మెను ప్రకటించింది.సేలం స్టీల్‌ ప్లాంట్‌లో సమ్మె పాక్షికంగా జరిగింది. ఇతర స్టీల్‌ ప్లాంట్లలో ప్రదర్శన నిర్వహించారు. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్మికులు అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అన్ని దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌, సిక్కింలలో వందలాది ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్లు, ఇతర పని ప్రదేశాలలో పూర్తి సమ్మెలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో కొన్ని సబ్‌ స్టేషన్లలో పాక్షిక సమ్మె, ఢిల్లీలోని ఘజియాబాద్‌, సాహిబాబాద్‌, నోయిడా, యుపిలోని బులంద్‌సహర్‌, హర్యానాలోని ఫరీదాబాద్‌లతో పాటు ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతంలోని లక్షలాది మంది పారిశ్రామిక కార్మికులు సమ్మెలో ఉన్నారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లోని పారిశ్రామిక ప్రాంతాల కార్మికులు దాదాపు అన్ని పారిశ్రామిక యూనిట్లలో భారీ సమ్మెలో చేరారు. ఉత్తర చెన్నై, కాంచీపురం, తమిళనాడులోని కంబాటోర్‌లోని ఎంఎన్సిలు, పవర్‌లూమ్స్‌, ఇంజనీరింగ్‌, ఎంఎస్‌ఎంఈలతో పాటు కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ , ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ప్రధాన కర్మాగారాల్లోని పారిశ్రామిక కార్మికులు కూడా హౌల్డింగ్‌తో పాటు సమ్మెలో ఉన్నారు. కేరళలో రాజ్‌భవన్‌తో సహా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ సమీకరణలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బీహార్‌, హర్యానా, రాజస్థాన్‌, నాగాలాండ్‌, పంజాబ్‌ తదితర ఆరు రాష్ట్రాల్లో సమ్మెలో ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. బీమా, బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా తమ శాఖలు, కార్యాలయాల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ బంద్‌, సమ్మె దేశమంతటా రైతు-కార్మికుల ఐక్యతను పటిష్టం చేయడానికి, గ్రామ, పట్టణ స్థాయి వరకు ప్రజల ఐక్యత దిశగా ముందుకు సాగడానికి, మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్పొరేట్‌-మత సంబంధానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గొప్ప విజయమని రైతు, కార్మిక నేతలు పేర్కొన్నారు.
కార్పొరేట్‌ కంపెనీల పట్ల పూర్తి సానుభూతి చూపిస్తున్న ప్రధాని మోడీ రైతులపై లాఠీచార్జి, పెల్లెట్‌ ఫైరింగ్‌, టియర్‌ గ్యాస్‌ స్ప్రేలు, డ్రోన్‌ల వినియోగం, రోడ్డు దిగ్బంధనం, ఇంటింటికీ బెదిరింపులతో అణచివేతకు గురిచేయడం దురదృష్టకరమని నేతలు విమర్శించారు. శంభులో ముగ్గురు రైతులకు చూపు కోల్పోయిన గాయాన్ని ఎస్కేఎం మరింత తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలను మోసం చేసిన మోడీ ప్రభుత్వం, తాను నిజాయితీపరుడని నమ్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 2021 డిసెంబర్‌లో ఎంఎస్పీ, ఇతర డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మోడీ ఒక కమిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, ఏడు నెలల తరువాత ఎంఎస్పీని ఇవ్వడాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన వారితో ఒక కమిటీని ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇప్పుడు చర్చల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు శంభు వద్ద ఆందోళనకారుల వద్దకు మంత్రులను పంపుతున్నారని, చర్చలను అపహాస్యం చేస్తూ చర్చలోని అంశాలను, పురోగతిని ‘రహస్యం’గా ఉంచి యావత్‌ దేశ రైతులను అంధకారంలో పడేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయిన మోడీ సర్కార్‌, మతపరమైన వివాదాల వైపు వారి దృష్టి మళ్లించడంలో బిజీగా ఉందని మండిపడ్డారు. రైతులు, కార్మికులు, విద్యార్థి, యువత, మహిళా,.సాంస్కృతిక కార్యకర్తల ఇతర సంఘాలకు మద్దతును అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి ఈ డిమాండ్లపై బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని, రైతు, కార్మిక, ప్రజల అనుకూల విధానాలను భర్తీ చేయడానికి ముందుకు సాగాలని ఆశిస్తున్నామని అన్నారు.
డిమాండ్లు
”సి2 ప్లస్‌ 50 శాతం ఎంఎస్పీతో పంటల సేకరణకు చట్టబద్ధ హామీ ఇవ్వాలి. ఇన్‌పుట్‌ ఖర్చులలో తగ్గించాలి. విత్తనాలు, ఎరువులు, విద్యుత్‌పై రైతులకు సబ్సిడీని పెంచాలి. అన్ని వ్యవసాయ కుటుంబాలను అప్పుల ఉచ్చు నుంచి విముక్తి చేయడానికి సమగ్ర రుణ మాఫీ పథకాన్ని అమలు చేయాలి. రైతుల ఆత్మహత్యలను ఎలాగైనా అరికట్టాలి. విద్యుత్‌ (సవరణ) బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు అనుమతించకూడదు. వాతావరణ మార్పులు, కరువు, వరదలు, పంట సంబంధిత వ్యాధులు మొదలైన వాటి వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు కార్పొరేట్‌ అనుకూల పీఎం ఫసల్‌ బీమా యోజనను ఉపసంహరించు కోవాలి. అన్ని పంటలకు సమగ్ర ప్రభుత్వ రంగ పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. చారిత్రాత్మక రైతు పోరాటాన్ని నిలిపివేసినప్పుడు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలి. (అమరవీరులైన రైతులందరికీ సింగు సరిహద్దులో స్మారక చిహ్నం, నష్ట పరిహారం చెల్లించి వారి కుటుంబాలకు పునరావాసం, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకోవడం). లఖింపూర్‌ ఖేరీ మారణకాండకు ప్రధాన కుట్రదారు కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీ మంత్రి పదవి నుంచి తొలగించి, విచారణ చేయాలి. ప్రభుత్వం రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలి. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ)ని రద్దు చేయాలి. ఖనిజాలు, లోహాల తవ్వకాలపై ప్రస్తుత చట్టాన్ని సవరించాలి. స్థానిక సంఘాలు, ముఖ్యంగా ఆదివాసీలు, రైతుల అభ్యున్నతి కోసం బొగ్గు గనులతో సహా గనుల నుండి లాభంలో 50 శాతం వాటాను నిర్ధారించాలి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. ఆహారం, మెడిసిన్‌, వ్యవసాయ ఇన్‌పుట్స్‌, యంత్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి. పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్‌ పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలి. కరోనా సాకుతో రద్దు చేసిన సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాం గులకు, మహిళలకు, క్రీడాకారులకు రైల్వే రాయితీని పునరుద్ధరించాలి. ఆహార భద్రతకు హామీ ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను విశ్వవ్యాప్తం చేయాలి. అందరికీ ఉచిత విద్య, ఆరోగ్యం, నీరు హక్కు. కొత్త జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. అందరికీ ఇండ్లు ఉండేలా చూడాలి. అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ), భూ సేకరణ పునరావాసం, పునరావాస చట్టం (ఎల్‌ఎఆర్‌ఆర్‌) 2013ని కఠినంగా అమలు చేయాలి. అటవీ (పరిరక్షణ) చట్టం, 2023, జీవ వైవిధ్య చట్టం, నివాసితులకు కూడా తెలియజేయకుండానే అటవీ క్లియరెన్స్‌ను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతించే నిబంధ నలకు సవరణలను ఉపసంహరించు కోవాలి. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ ను క్రమం తప్పకుండా నిర్వహించాలి. పని చేసే హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. మంజూరైన పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. రోజుకు రూ.600 వేతనంతో ఏడాదికి 200 రోజులకు ఉపాధి హామీ విస్తరించాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి. నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలి. పనిలో సమానత్వం, భద్రతను నిర్ధారించాలి. అసంఘటిత కార్మికులను నమోదు చేసి, పెన్షన్‌తో సహా సమగ్ర సామాజిక భద్రత కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ కవరేజీని అందించాలి. సంక్షేమ నిధి నుండి విరాళాలతో పాటు, ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ ఆరోగ్య పథకాలు, ప్రసూతి ప్రయోజనాలు, జీవిత, వైకల్య భీమా కవరేజీని కూడా అందించాలి. గృహ కార్మికులు, గహ-ఆధారిత కార్మికులపై ఐఎల్‌ఓ ఒప్పందాలను ఆమోదించి, తగిన చట్టాలను రూపొందించాలి. వలస కార్మికులపై సమగ్ర విధానాన్ని రూపొందించాలి. ఇప్పటికే ఉన్న ఇంటర్‌-స్టేట్‌ మైగ్రెంట్‌ వర్క్‌మెన్‌ (ఉపాధి నియంత్రణ) చట్టం-1979 వారి సామాజిక భద్రతా కవర్‌ పోర్టబిలిటీని బలోపేతం చేయాలి. ఎన్పిఎస్‌ ని రద్దు చేసి, ఓపిఎస్‌ ని పునరుద్ధరించాలి. అందరికీ సామాజిక భద్రతను అందించాలి. కనీస పెన్షన్‌ నెలకు రూ.10 వేలు ఉండేలా చూడాలి. సూపర్‌ రిచ్‌పై పన్ను విధించాలి. కార్పొరేట్‌ పన్నును మెరుగుపరచాలి. సంపద పన్ను, వారసత్వ పన్నును మళ్లీ ప్రవేశపెట్టాలి. హిట్‌ అండ్‌ రన్‌ నిబంధనలతో సహా భారతీయ న్యాయ సంహితలోని క్రూరమైన నిబంధనలను ఉపసంహరించుకోవాలి” వంటి డిమాండ్ల సాధన కోసం గ్రామీణ బంద్‌ జరిగింది.