డ్రోన్‌ సవాల్‌కా జవాబ్‌ పతంగ్‌ సే….

డ్రోన్‌ సవాల్‌కా జవాబ్‌ పతంగ్‌ సే....మధ్యాహ్నం అవుతుండగా వచ్చాడు వెంకన్న రాగానే భార్యను భోజనం పెట్టమని పురమాయించాడు. ఆ తర్వాత వెళ్ళి కాళ్ళూ, చేతులూ కడుక్కుని వచ్చాడు. డైనింగ్‌ టేబుల్‌ మీద అన్ని పెట్టి ఉన్నాయి. కాని వడ్డించాల్సిన, భార్యామణి మాత్రం కనబడలేదు.
‘లక్ష్మీ!” గావుకేక పెట్టాడు వెంకన్న.
”అబ్బ ఎందుకరుస్తారు? అన్నీ టేబుల్‌ మీదే ఉన్నాయి కదా!” అన్నది లక్ష్మి టీవీ చూస్తూ.
”టీవీ చూడకపోతే కొంపలేమీ మునిగిపోవు గాని వచ్చి వడ్డించు!” అన్నాడు వెంకన్న.
”కొంపలు మునిగిపోతున్నాయి కాబట్టే చూస్తున్నా!” అంటూ లక్ష్మి వచ్చి భోజనం వడ్డించింది.
”ఏం చూస్తున్నావు టీవీలో!” ముద్ద నోట్లో పెట్టుకుంటూ అడిగాడు వెంకన్న.
”రైతుల పోరాటం చూస్తున్నానండి! నాకైతే స్వతంత్య్ర పోరాటం చూస్తున్నట్లుంది! ఎంతటి తెగువ! ఎంత సాహసం, ఎంత చాకచక్యం! అదంతా చూస్తుంటే గూస్‌బంప్స్‌! అంతే!” అన్నది లక్ష్మి.
”ఏమిటీ! రైతుల పోరాటాన్ని తెగ పొగుడుతున్నావు! వారంతా మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తెలుసా!” అన్నాడు వెంకన్న.
”అవును! అందుకే తెగ నచ్చుతున్నారు! మన రైతన్నలు”! అన్నది లక్ష్మి.
”మోడీ అంటే ఎవరనుకున్నావు. విష్ణు అంశ తెలుసా? అంతటి మహానుభావుడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే చనిపోయాక డైరెక్టుగా రౌరవ నరకంలోనే పడతారు తెలుసా?” అన్నాడు వెంకన్న.
”చనిపోయేదాకా ఆగుతున్నారా? బతికుండగానే టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్లు, ముళ్ళ కంచెలు ఇలాంటివి వాడి రైతన్న లకి నరకం చూపిస్తున్నారు కద! ఐనా శత్రు సైనికుల మీదికి పంపినట్లు రైతన్నలపైకి డ్రోన్స్‌ పంపుతారా! ఇదెక్కడి అన్యాయం?” తీవ్రంగా అన్నది లక్ష్మి.
”అదే మా మోడీ చాకచక్యం! టెక్నాలజీ వాడటంలో ఆయన్ను మించిన వారు లేరు!” తన నాయకుడి ప్రతిభకు తానే మురిసిపోతూ అన్నాడు వెంకన్న.
”ఆ.. మీ నాయకుడి తెలివితేటలు ఏడ్చినట్లు ఉన్నాయి! మీ లేటేస్ట్‌ టెక్నాలజీ డ్రోన్‌ను, పాతకాలపు పతంగితో పడగొట్టారు మా రైతన్నలు. అది చూస్తుంటే వీర తెలంగాణ పోరాటంలో వాడిన ఊదరబాంబులు గుర్తొస్తున్నాయి! శ్రమజీవుల తెలివితేటలకు అన్నీ దాసోహం కావల్సిందే!” అన్నది లక్ష్మి.
”సొంత ప్రభుత్వం మీద తిరగబడతారా! ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం! అది లేకుండా చేసేది పోరాటం కాదు! దొమ్మి! అందుకే వారిని అడ్డుకునటంలో తప్పేం లేదు!” అన్నాడు వెంకన్న.
”ఈ పదేళ్ళలో మీకెప్పుడైనా ప్రజాస్వామ్యం గుర్తు కొచ్చిందా? రైతులో కార్మికులో పోరాటాలు చేస్తున్నప్పుడే ప్రజా స్వామ్యం గురించి మాట్లాడొచ్చా? ప్రజాస్వామ్యంలో చర్చలు జరిగితే తప్పా? రైతుల డిమాండ్లపై పరిష్కరించుతామని ప్రకటన ఎందుకు చేయరు? ప్రశ్నించింది! లక్ష్మి.
”రైతుల సమస్యలపై ముగ్గురు కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నారు! ఇంకేం గావాలి? అన్నాడు వెంకన్న.
”ఆ తోలుబొమ్మలతో జరిగే చర్చలు ఫలితాలు ఇస్తాయా? మీ మూలవిరాట్టుకి రైతులతో మాట్లాడే తీరిక లేదా! లక్షదీపానికి వెళ్ళొస్తారు! అయోధ్య, అబుదాబులలో రాముల వారి గుళ్ళు ప్రారంభిస్తారు! కాని దేశానికి తిండిపెట్టే రైతన్నలతో మాట్లాడటానికి మాత్రం తీరిక లేదా! ఆయన దేశ ప్రధానా లేక పీఠం వేసుకున్న మఠాధిపతా?” ఘాటుగా ప్రశ్నించింది లక్ష్మి.
వెంకన్న కొంచెం తడబడ్డాడు.
”కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేశాము. కనీస మద్దతు ధర గురించి రైతు సమస్యల గురించి మాట్లాడిన స్మామినాథన్‌కి ”భారతరత్న” అవార్డు ఇచ్చాము. రైతుల కోసం ఇంతకు మించి ఎవరైనా చేయగలరా?” ఎదురు ప్రశ్నించాడు వెంకన్న.
”బ్రహ్మాండంగా చేయవచ్చు! సిద్ధాంతం చెప్పిన స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు ఇవ్వటం గొప్ప కాదు. ఆయన చెప్పినట్లు కనీస మద్దతు ధర కల్పిస్తే, అదే వంద భారతరత్నల పెట్టు! అసలు విషయం పక్కన పెట్టి కొసరును పట్టుకుని వేలాడటం వీరికే చేతనవును!” అన్నది లక్ష్మి.
”చట్టం చేయటం అంటే వంట చేయటం కాదు! న్యాయ పరమైన చిక్కులు, ఆర్థిక పరమైన అంశాలు ఎన్ని ఉంటాయి. వాటిని సరిచేసి చట్టాలు చేయాలి! అందుకే టైము పడుతుంది! ఆ మాత్రం ఓపిక పట్టలేరా?” అన్నాడు వెంకన్న.
పెద్దగా పవ్వింది లక్ష్మి!
”వంట చేయటం కన్నా స్పీడుగా చట్టాలు చేసిన మీరేనా ఇట్లా మాట్లాడేది! 44 కార్మిక చట్టాలు ఒక్క దెబ్బతో రద్దు చేసి, లేబర్‌ కోడ్స్‌ అంటూ కొత్త చట్టం చేస్తిరి. పాత క్రిమినల్‌ చట్టాలు బుల్డోజ్‌ చేసి, న్యాయ సంహిత అంటూ నోరు తిరగని చట్టం తెస్తిరి. మోటార్‌ వెహికల్‌ యాక్టు, కొత్త విద్యాచట్టం అంటూ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల మీద కూడా మీరే పెత్తనం చేసి, కొత్త చట్టాలు చేసినపుడు టైము కావాలని అన్న వారిని బయటికి గెంటేసి మరీ చట్టాలు చేసిన మీరు, రైతన్న కోసం చట్టం చేయటానికి ఎందుకు సిద్ధం కావటం లేదో చెప్పండి!” అన్నది లక్ష్మి.
”కనీస మద్దతు ధర పెంచితే. ప్రజల మీద భారం పెరుగుతుంది. అందుకే మోడీ ఆలోచిస్తున్నారు!” అన్నాడు వెంకన్న.
”ప్రజల మీద మోడీకి అంత ప్రేమ ఉందా! ఉంటే పెట్రోల్‌ ధర ఎందుకు పెంచారు? పాల మీద, పెన్సిల్‌, రబ్బర్‌, నోట్‌బుక్కుల మీద జీఎస్టీ ఎందుకు వేశారు? ఇలాంటివి చాలా ఉన్నాయి” అన్నది లక్ష్మి.
వెంకన్న ఏదో చెప్పబోయాడు.
”ఆగండి! గతపదేళ్ళలో రూ.లక్ష కోట్ల అప్పు చేశారు! ఇందులో రైతులు, కార్మికుల కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? ఇదే కాలంలో అంబానీలు, ఆదానీలు మొ|| వారు బ్యాంకులకు, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ.12 లక్షల కోట్ల అప్పులు రద్దు చేశారు! అప్పుడెవరినీ అడగలేదు! సలహాలు తీసుకోలేదు! మరిప్పుడు ఆలోచించుతున్నారు! ఇది చాలదా? మీరు రైతుల వైపా, ఆదానీల వైపా అని అర్థం చేసుకోవటానికి” అన్నది లక్ష్మి.
వెంకన్న తల దించుకున్నాడు.
”సరే గాని! భోజనం ఎలా ఉంది!” అడిగింది లక్ష్మి.
”నీ వంటకి పేరు పెట్టగలనా? అద్భుతం!” అన్నాడు వెంకన్న.
”ఆ అద్భుతం నా చేతిది కాదు! ఆరుగాలం శ్రమించిన నా రైతన్నది! ఇది గుర్తు పెట్టుకోండి!” అన్నది లక్ష్మి.
– ఉషా కిరణ్‌