బట్టలు కొంటున్నామంటే
మా అందరి మధ్యలో
వాడెప్పుడూ బేరమాడుతుండేవాడు
రూపాయి రూపాయి పోగు చేసుకునే
మనిషి వాడు.
మొదటిసారి ఈ ఖాకి చొక్కాకే
వాడు బేరమాడలేదు.
అన్నా వస్తది ఇయ్యి అన్నా…
అని నాలుగు షాపుల మెట్లు ఎక్కలేదు.
ఏ కోఠి సెంటర్లనో,
దిల్‌సుఖ్ నగర్ వీధుల్లోనో
అగ్వ ధరకు దొరికే నాలుగు టీ షర్ట్లు
సంవత్సరం పొడుగునా వాడి
ఒళ్ళునైతే కప్పేవి.
కుటుంబం, బాధ్యత గాయాలు రగిలి
మన్సులోపల పుండై చీము కారుతుంటే
లోపల ఉన్న దుఃఖాన్ని
ఎన్నిసార్లు బంధించుకున్నాడో..?
ఆశల తీరంకై దుఃఖపు సముద్రంలో
పెన్నులు, పేపర్లే నా రెక్కలని నమ్మి
ఎన్ని రోజులు ఈదాడో..?
ఉద్యోగాలని కోచింగ్ సెంటర్లకు వచ్చి
అశోక్ నగర్ వీధుల్లో రోడ్ల వెంట
తనలానే సాయిబాబా గుడికి
బుక్కెడు బువ్వ కోసం
సిట సిట ఎండలో నడిచిన
వాడిలాంటి ఎన్నో జీవితాల పాఠాలు..
ఎన్ని నేర్చుకుని ఉంటాడు.
బయటికి మాత్రం చిరునవ్వుతో
చూడ్డానికి అందరిలానే నవ్వుతో
తనకు తాను రంగులద్దుకునేవాడు.
నోటిఫికేషన్లన్నీ చిల్లులు పడి
కోర్టు మెట్లెక్కుతుంటే
వీడు ఎన్నిసార్లు గాయపడ్డాడో
ఎన్ని కలలని ఖూనీ చేసుకున్నాడో..?
ఒకటైన వెలుగు దారి దొరక్కపోదా..!
సమాధానం లేని మౌనంతో ఎన్ని
నిద్ర లేని రాత్రులు గడిపాడో..!
చిన్గిన అంగులతో చితికిన బతుకులు…
వాడి లాంటి ఎన్నో గుండెలకు
ఒక యూనిఫామ్ దొరికింది.
ఎప్పుడూ కష్టానికి తగ్గ ఫలితం
అంటుండే వాడు
ఇప్పుడు కష్టం తాలూకు ఫలితమే
పోలీస్ రూపంలో సెల్యూట్ చేసింది…
నిజంగా మాట్లాడాలంటే మొదటిసారి
ఈ చొక్కాలోనే వాడు
గాయాల్ని కప్పిపెట్టుకున్నాడు.
– దండు వెంకట్ రాములు
6303163202