– పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును నిర్లక్ష్యనికి గురైందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. శనివారం శాసనసభలో ఆయన సాగునీటి ప్రాజెక్టుల శ్వేతపత్రంపై ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదని విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం అనేక ఉద్యమాలు చేశామనీ, అయినా రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదన్నారు. ప్రజల కోసం ఉద్యమాలు చేసినందుకు తమపై కేసులు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తే, దాన్ని కాదని కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మొబలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంటే, ఆ డబ్బును రికవరీ చేసినట్టు తెలిపారు. ఆ కాంట్రాక్టర్లకే ప్రాజెక్టు నిర్మాణాన్ని కట్టబెట్టిందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.