– చట్టబద్ధత కల్పించాలి
– కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక విధానం :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తలాతోక లేని తీర్మానాన్ని ఆమోదించి కులగణనను ఏ విధంగా చేస్తారని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదనా చారి, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎలా చేస్తారు? ఏ సంస్థ ద్వారా చేయిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో అందుకు కేటాయించిన నిధులెంతా ? కులగణన లక్ష్యాలేంటి ? అన్న అంశాలపై ప్రభుత్వం తీర్మానంలో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. కులగణన తీర్మానం కంటితుడుపు చర్యగా మభ్యపెట్టే విధంగా ఉందని తెలిపారు. బీహార్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించి నిధులు కేటాయించడమే కాకుండా కులగణన పూర్తి చేయడానికి నిర్ణీత గడువును విధించాయని గుర్తు చేశారు. దాంతో బీహార్‌లో బీసీల మొత్తం రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం 75 శాతానికి పెంచగలిగిందని అన్నారు. ఎంబీసీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించిందనీ, బీసీలకు అదనంగా 28 శాతం కల్పించి 43 శాతానికి పెంచిందని వివరించారు. కాబట్టి బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలనీ, వారికి ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయించాలని సూచించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, నాయకులు బొల్ల శివశంకర్, తాడూరి శ్రీనివాస్, రాజారాం యాదవ్, ఆలకుంట్ల హరి, కోల శ్రీనివాస్, ఆర్వీ మహేందర్, విజేందర్ సాగర్, ఏల్చల దత్తాత్రయ, గీతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.