– పంట భూములపై ‘కార్పోరేట్’ ప్రతాపం
– అనుమతికి మించి భూముల కాజేతకు యత్నం
– ప్రశ్నించిన రైతులకు బెదిరింపులు
– గత్యంతరం లేక కోర్టులో బాధితుల పిటిషన్
‘ఇస్సుంట రమ్మంటే…ఇల్లంత నాదనే’ రీతిలో గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ వ్యవహారం ఉంది. ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం కేటాయించిన దానికన్నా అదనపు భూములను కాజేసే యత్నాలకు దిగుతోంది. రకరకాల సాకులు చూపుతూ ప్రశ్నించిన రైతులను బెదిరిస్తోంది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / కొణిజర్ల
ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన పేరుతో గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ సారవంతమైన భూములపై కన్నేసింది. ప్రభుత్వ అనుమతికి మించి భూములను కాజేయాలనే యత్నాలకు పాల్పడుతోంది. రెండు పంటలు పండే భూములు లాక్కొని రైతుల పొట్టకొట్టాలని చూస్తోంది. భూముల విలువ ఎకరం రూ.50 లక్షలకు పైగా ఉంటే నాడు అసైన్డ్ భూములకు రూ.20 లక్షల వరకు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. తొలుత రూ.12 లక్షల వరకే పరిహారమనడంతో రైతులు ఆందోళనలు చేశారు. పట్టా భూములను సైతం అదే రీతిలో లాక్కోవాలనే ‘కార్పొరేట్’ కుటిల యత్నాలకు కంపెనీ నాటి నుంచే దిగుతోంది. అధికారికంగా కేటాయించిన దానికన్నా అదనంగా భూమిని కాజేసేందుకు పూనుకుంటోంది.
ఇంకా.. ఇంకా కావాలి…
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి రెవెన్యూ సర్వే నంబర్ 111లో 113.15 ఎకరాల భూమిని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ కోసం కేటాయించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు గతేడాది సెప్టెంబర్ 29న మాజీ మంత్రి కేటీఆర్ ఆగమేఘాల మీద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ కోసం భూమి పూజ చేశారు. అక్కడే గోద్రేజ్ కంపెనీ సమాధాన్ కేంద్రం (కార్యాలయం) వద్ద శిలాఫలకాన్నీ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ శిలాఫలకం అక్కడ కనిపించడం లేదు. నాడు కేటాయించిన 113.15 ఎకరాల అసైన్డ్ భూమి పక్కనే ఉన్న 60 ఎకరాల పట్టా భూములు సైతం లాక్కోవాలని గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రయత్నిస్తోందని ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన దానికన్నా అదనంగా భూములు ఇవ్వాలని సంబంధిత రైతులపై ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వం సైతం ఆ భూమి కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో సంబంధిత 30 మందికి పైగా రైతుల్లో ఆందోళన నెలకొంది.
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు..
అప్పట్లో రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించారు. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. నూతన ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 28వ తేదీన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 60 ఎకరాలు కేటాయించింది. వెంటనే రైతులు హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. తిరిగి జనవరి 9న సైతం మరోమారు పిటిషన్ ఇచ్చారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండే సారవంతమైన భూములను ఉద్దేశపూర్వకంగా లాక్కునే యత్నానికి కంపెనీ దిగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు పంటలు పండే ఈ భూముల్లో నుంచే ఎన్నెస్పీ ఎడమ కాల్వ సైతం పోతుంది. దాంతో పాటు దెయ్యాల వాగు, బోర్లు, బావులు నీటి వనరులుగా ఉండటంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అశ్వారావుపేటలో 50 ఎకరాల్లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఇక్కడ 113.15 ఎకరాలు కేటాయించినా అది చాలదన్నట్టు 60 ఎకరాల భూములను కూడా లాక్కోవాలని కార్పొరేట్లు యత్నిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీనిపై బాధిత రైతులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తమ బాధను చెప్పుకొని, న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
సారవంతమైన భూములెలా ఇస్తాం..– చల్లగుండ్ల రవి, బాధిత రైతు
ఏటా రెండు పంటలు పండే భూములు తీసుకుంటామంటే ఊరుకోం. అవసరానికి మించి భూములు కేటాయించమని గోద్రేజ్ కంపెనీ అడగటం, ప్రభుత్వాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు. అధికారికంగా కేటాయించిన భూమి కన్నా అదనంగా అడిగే హక్కు కంపెనీకి ఎలా ఉంటుంది.
113.15 ఎకరాలు మాత్రమే కేటాయించాం.. – తఫజల్ హుస్సేన్, కొణిజర్ల తహసీల్దార్
గత ప్రభుత్వం 113.15 ఎకరాల భూమిని గుబ్బగుర్తి రెవెన్యూలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి అధికారికంగా కేటాయించింది. అంతకుమించి కావాలని నోటిఫికేషన్ వెలువడటంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయం, కోర్టు తీర్పు ప్రకారం ముందుకెళ్తాం.
అదనపు భూమిని ఇచ్చేదెక్కడిది? – బొంతు రాంబాబు, తెలంగాణ రైతుసంఘం, ఖమ్మం జిల్లా కార్యదర్శి
అదనపు భూమిని కార్పొరేట్లు అడుగుతారు. ఇప్పటికే కేటాయించిన దానికన్నా మించి ఎక్కువ ఇచ్చారు. కేటాయించిన భూముల రైతులకు కూడా అరకొర పరిహారం ఇచ్చారు. అది చాలదన్నట్టు ఇప్పుడు 60 ఎకరాలు ఇవ్వాలని కంపెనీ అడుగుతోంది. వాళ్లు అడిగినంత ఇచ్చుకుంటూ పోదామా? కార్పొరేట్ల భూ దాహానికి ప్రభుత్వాలు వంతపాడటం సరికాదు.