శ్వేతపత్రం.. సత్యదూరం

White Paper.. Satyaduram– తప్పులు చేయలే భయపడం
– చేసినట్టు నిరూపిస్తే చర్యలకు సిద్ధం
– ప్రభుత్వం మీది ఏ విచారణ అయినా చేసుకోండి
– మేడిగడ్డలో పునరుద్ధరణ పనులు చేయండి : బీఆర్‌ఎస్‌ సభ్యులు టి. హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగు నీటిపారుదల రంగంపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉందనీ, సభ్యులకు ఇచ్చిన పుస్తకం తప్పుల తడకగా ఉందని బీఆర్‌ఎస్‌ సభ్యులు తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. తాము తప్పు చేయలేదనీ, భయపడే సమస్యే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మీదనీ, ఏ విచారణ అయినా చేసుకోండి అని సవాల్‌ విసిరారు. తప్పుచేసినట్టు తేలితే చర్యలు తీసుకోవచ్చునన్నారు. శనివారం అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తన ప్రసంగానికి మంత్రులు, సీఎం అడ్డుతగలటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో మధ్యమధ్యలో అంతరాయం కలుగకుండా చూడాలని స్పీకర్‌ను చేతులెత్తి వేడుకున్నారు. శ్వేతపత్రంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయన్నారు. మంత్రి చెప్పినట్టు మిడ్‌మానేరు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తికాలేదనీ, తమ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు వెచ్చించి పూర్తిచేశామని చెప్పారు. ప్రాజెక్టుల ఖర్చు, ఆయకట్టుపై ఒక్కోపేజీలో ఒక్కో విధంగా చెప్పారని విమర్శించారు. రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌పై కేంద్రానికి తాము ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీకి అప్పగించాలని గెజిట్‌ ఇస్తే తాము సవాల్‌ చేయలేదని పేర్కొనడం సరిగాదనీ, దాన్ని వ్యతిరేకిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌కు రిఫర్‌ చేయాలని చెప్పామని తెలిపారు. మంత్రి చెప్పినట్టుగా కేఆర్‌ఎమ్‌బీకి ప్రాజెక్టులను తాము అప్పగించలేదన్నారు. 50:50 రేషియో కోసం తాము కొట్లాడలేదని చెప్పడం శుద్ధ అబద్ధమని చెప్పారు. రాష్ట్ర విభజన నుంచి కోరుతూనే ఉన్నామనీ, న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూనే వచ్చామని వివరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు నాలుగు సార్లు శంకుస్థాపన చేయడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వడాన్ని సైతం కాగ్‌ తప్పుపట్టిన విషయాన్ని ఎత్తిచూపారు. ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ సబ్‌కమిటీ వేశారనీ, అందులో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టును మార్చాలనుకోలేదనీ, ఏడేండ్లలో ఎలాంటి ప్రాజెక్టు అనుమతులను సాధించలేదని విమర్శించారు. దానికి జాతీయ హోదా ఇవ్వాలని పట్టుబట్టిన విషయాన్ని ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు సాధ్యంకాదనీ, ఖర్చు వృథా చేసుకోవద్దని అప్పటి మహారాష్ట్ర సీఎం ఏపీ సీఎంకు లేఖరాశారని గుర్తుచేశారు. 2007 నుంచి 2014 వరకు కేంద్రంలో, ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ కనీసం అగ్రిమెంట్‌ కూడా పూర్తిచేయలేకపోయిన విషయాన్ని ఎత్తిచూపారు. మహారాష్ట్రతో ఒప్పందంలో చేసుకోవడంలో విఫలమైనందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జలాశయాలు కట్టే సామర్థ్యం ఆ ప్రాంతంలో లేదని సీడబ్ల్యూసీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో బీడుభూములు దర్శనమిచ్చేవనీ, నీటి ఘోస, వివక్ష, ఆర్థిక దోపిడీని ప్రశ్నిస్తూ పాటలు రాయని కవి లేడని చెప్పారు. గద్దర్‌, అందెశ్రీ, జయరాజు పాడిన పాటలను వినిపించారు. ఉమ్మడిపాలనలో పొలాలకు నీళ్లు రాలేదు..మా పాలనలో పొలాలకు నీళ్లు అందాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద తక్కువ ఆయకట్టు వచ్చిందని తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందాయని ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టులోనే ఉందన్నారు. ఒక ప్రాజెక్టు కింద ఆయకట్టు స్థిరీకరణకు కొన్నేండ్లు పడుతుందని చెబుతూ..ఎస్సారెస్సీ, నాగార్జునసాగర్‌, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, దేవాదుల ప్రాజెక్టుల కింది ఆయకట్టు గురించి వివరించారు. కాగ్‌ నివేదిక మీద కాంగ్రెస్‌ మాట్లాడితే సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడమేనని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి కింద ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందించేలా పనులు మొదలు పెట్టామన్నారు.
మేడిగడ్డపై కావాలనే తాత్సారం
మేడిగడ్డ బ్యారేజ్‌కు కావాలనే పునరుద్ధరణ చర్యలు చేపట్టడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. మొత్తం కూలేదాకా వేచిచూసి రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉందనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. అలా చేయకుండా వెంటనే పునరుద్ధరణ పనులు చేయాలని డిమాండ్‌ చేశారు. తప్పులు ఎవరు చేసి శిక్ష వేస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలోనూ కడెం ప్రాజెక్టు మొదటి ఫిల్లింగ్‌కే కొట్టుకుపోయిందనీ, దేవాదుల పైపులు పటాకుల్లా పేలాయనీ, సింగూర్‌ డ్యామ్‌, ఎల్లంపల్లి, పుట్టంగండి గేట్లు, డయాఫ్రమ్‌లు కొట్టుకువడం, పైపులు పగిలిపోవడం వంటి విషయాలను ప్రస్తావించారు. మిషన్‌ కాకతీయ వల్ల 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందనీ, భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. పదేండ్ల తమ పాలనలో మేజర్‌, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ కింద, 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్‌ చేశామన్నారు. 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 35 పనులు మంజూరు చేస్తే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని విమర్శించారు. తెలంగాణ కృష్ణా నది నుంచి 299 టీఎంసీలు కాదు..600 టీఎంసీలు తెచ్చుకునే అవకాశముందని చెప్పారు.