– నివాళులు అర్పించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-చిట్యాలటౌన్
ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి.సంధ్య భర్త, కవి.. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో శని వారం ముగిశాయి. ఆయన అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం విదితమే. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రామకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ సందర్శించి నివాళులర్పించారు. వామపక్ష ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని నిలి చిన నాయకులు రామకృష్ణారెడ్డి అని కొనియాడారు. అనంతరం రామకృష్ణారెడ్డి భార్య సంధ్యను ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) నాయకులు బండి రమేష్, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, కాంగ్రెస్ నాయకుడు దుబ్బాక నర్సింహ్మారెడ్డి, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సుభద్ర, ఏపీ రాష్ట్ర నాయకులు పద్మ. సీపీఐన్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వర్లు, గోవర్ధన్, చిట్టిపాక వెంకటేశ్వర్లు, అనురాధ, అమర్, మధు, సాగర్ ఉన్నారు.
రామకృష్ణారెడ్డి గొప్ప ప్రగతిశీల వాది..
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు
ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి.సంధ్య భర్త, కవి, నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి గొప్ప ప్రగతిశీల వాదని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మృతి అభ్యుదయ శక్తులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్నీ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వామపక్ష ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని నిలిచిన నాయకులు రామకృష్ణారెడ్డి అని నున్నా ఈ సందర్భంగా గుర్తుచేశారు.