– వేతన పెంపు కనీసం 25 శాతం ఉండాలి : ఎల్ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం 14 శాతం వేతన పెంపు ప్రతిపాదనను తిరస్కరించింది. ఐదేండ్ల ఒప్పందం ప్రకారం 2017 నుంచి వేతన సవరణ జరగాల్సిన ఉద్యోగులు కనీసం 25 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ముంబయిలో ఆల్ ఇండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎన్ఎల్ఐఈఎఫ్), ఎల్ఐసీలోని ఇతర యూనియన్లతో జరిపిన ఒక సమావేశంలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం అందించింది. దీనిని యూనియన్ తిరస్కరించింది. ఇది అంకితభావాన్ని, కార్మికుల నిబద్ధతను ప్రతిబింబించడం లేదని తెలిపింది. ఏఐఎన్ఎల్ఐఈఎఫ్ జనరల్ సెక్రెటరీ రాజేష్ నింబాల్కర్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అనేక పరామితులలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ పనితీరును పరిగణనలోకి తీసుకుంటే, మేనేజ్మెంట్ చేసిన ఆఫర్ ఉద్యోగులను నిరాశపరిచిందని పేర్కొన్నారు. ఉద్యోగులకు చివరి పెంపు 2017లో జరిగింది. తదుపరి సవరణ 2022లో జరగాల్సి ఉంది. ”2017 వేతన సవరణలో, కంపెనీ దాదాపు 20-25 శాతం పెంపును ఇచ్చింది. ఈసారి కూడా మేము దాదాపు 22 శాతం పెంపును ఆశిస్తున్నాం” అని నింబాల్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మూడో త్రైమాసికంలో సంవత్సరానికి 49 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరంలో రూ. 6,334.29 కోట్ల నుంచి రూ. 9,444.42 కోట్లుగా ఉన్నది. నికర ప్రీమియం ఆదాయం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు మెరుగుపడింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం కూడా గత డిసెంబర్ త్రైమాసికంలో రూ.1,96,891 కోట్లతో పోలిస్తే రూ.2,12,447 కోట్లకు పెరిగింది.