– బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇండ్ల ముందు ఆందోళన : సంయుక్త కిసాన్ మోర్చా
నవతెలంగాణ న్యూఢిల్లీ బ్యూరో
2021 డిసెంబర్ 9న ఎస్కేఎంతో ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో పాటుగా ఎంఎస్పీ సి2+50 శాతం హామీతో కూడిన సేకరణ, సమగ్ర రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 21న బీజేపీ, ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నల్లజెండాలు ప్రదర్శించాలని దేశ వ్యాప్తంగా రైతులకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ”కరెంటు ప్రయివేటీకరణ ఆపాలి. లఖింపూర్ ఖేరీలో రైతుల మారణకాండకు ప్రధాన సూత్రధారి కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనిని తొలగించి, విచారించాలి. పంజాబ్ సరిహద్దులో రైతుల అణచివేతను అరికట్టాలి” అని డిమాండ్ చేసింది. రైతు వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, అణచివేత, నియంతత్వ వైఖరిని బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేసింది. పంజాబ్‌లో మూడు రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, బీజేపీ జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముందు రాత్రి పగలు భారీ నిరసనలు చేపట్టాలని ఎస్కేఎం నిర్ణయించింది. 20 ఉదయం 10 గంటలకు నిరసన ప్రారంభమై ఫిబ్రవరి 22 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్లతో అవినీతిని చట్టబద్ధం చేసి వేల కోట్ల రూపాయలను పార్టీ ఫండ్‌గా పోగు చేయడాన్ని మోడీ ప్రభుత్వం తీవ్రంగా ఎస్కేఎం ఖండించింది. దీనిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎస్కేఎం స్వాగతించింది.