– తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనే లక్ష్యంగా
– గతంలో అనేక ప్రమాదాలు
– కష్టజీవుల ప్రాణాలతో చేలాగాటం
– ఆటోలలో పరిమితికి మించి కూలీల ప్రయాణం
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ మరియు పరిసర ప్రాంతాల నుండి మిరప కూలీలు ఆంధ్ర ప్రాంతం వైపు కూలిపని కోసం ప్రయాణం చేస్తుంటారు. అయితే వారికి ప్రమాదమని తెలిసినప్పటికీ కిక్కరిసిన ఆటోలలోనే ప్రయాణం చేస్తున్నారు. బతుకు దెరువు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ఎంతోమంది కూలీలు నిత్యం ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహనదారులు నిబంధనలకు నీళ్ళొదిలి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వాహనాలను నడుపుతున్నారు. ఫలితంగా అనేక ప్రమాదాలూ జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఈకారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూలికి వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి చేరే వరకు ఆయా కుటుంబాల్లో ఆందోళనే. కష్టజీవుల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై చర్యలు తీసుకునేవారు కరువవడంతో ఆటోవాళ్లదే ఇష్టారాజ్యంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లు పరిమితికి మించిన ప్రయాణికులతో మితిమీరిన వేగంతో తీసుకెళుతున్నారు. నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో, రహదారులపై మలుపుల్లో బోర్లా పడటం, ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ప్రమాదాలు జరగటం, అక్కడికక్కడే సర్దుబాటు చేసుకొని వెళుతుండటం సర్వసాధారణమైంది. అంతేకాక ఆటోలకు సరైన పత్రాలు లేకపోవడం, డ్రైవర్లకు లైసెన్సులు లేకపోవడంతో ప్రమాదాలకు గురైన వారికి బీమాకూడా అందటంలేదు. దీనికి తోడు కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. మరికొంత మంది చిన్నవయస్సులోనే అవగాహన లేకుండా తెలిసీ, తెలియని డ్రైవింగ్ చేస్తూ, మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ నియంత్రించలేక ప్రమాదాలకు కారణమౌతున్నారు.ప్రస్తుతం మిరప కూలీలను మినీలారీలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి ఎక్కించుకొని తీసుకువెళుతున్నారు. ఆటోలలో 20 మందికిపైగా ఎక్కుతున్నారు.పోలీసులు కూలీలకు కూడా సరైన అవగాహన కల్పించి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆటోల్లో పరిమితికి మించి ఎక్కిస్తున్నారు..సిరికొండ మధు,రైతు సంఘం సాగర్ పట్టణ అధ్యక్షులు: చిన్న ఆటోలలో నలుగురు, పెద్ద ఆటోలలో ఏడుగురు ఎక్కాల్సిఉన్నా డ్రైవర్లు పరిమితికి మించి కూలీలను ఎక్కిస్తున్నారు. సరుకు రవాణాకు ఉపయోగించాల్సిన మినీ ట్రక్కులలో,ట్రాక్టర్ లలో కూలీలను ఎక్కిస్తూ ప్రమాదాలకు గురిచేస్తున్నారు. త్వరగా గమ్యం చేరాలనే ఉద్దేశంతో మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రయాణికులు ఇంటికి క్షేమంగా చేరే పరిస్థితి కనిపించడంలేదు.