బీజేపీ ఎంపీ ఫిర్యాదు నేపథ్యంలో…

– సభా హక్కుల కమిటీ కార్యకలాపాలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పశ్చిమ బెంగాల్‌ చీఫ్‌ సెక్రెటరీ, ఇతర అధికారులకు సమన్లు జారీ చేసిన లోక్‌సభ సభా హక్కుల కమిటీ కార్యకలాపాలపై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. ఆ అధికారులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, దారుణంగా, ప్రాణాపాయం కలిగించేలా గాయపరిచారని బీజేపీ ఎంపీ వారిపై ఫిర్యాదు చేశారు. లోక్‌సభ సెక్రెటేరియట్‌కు కూడా చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తృణమూల్‌ నేతల అత్యాచారాలపై మహిళలు ఆందోళన చేస్తున్న సందేశ్‌ఖలిలోకి మజుందార్‌ను ప్రవేశించ నీయకుండా ఆపడంతో పోలీసు సిబ్బందితో తృణమూల్‌ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో మజుందార్‌ గాయపడ్డారు. సుప్రీం స్టేతో చీఫ్‌ సెక్రెటరీ, ఇతర అధికారులు ఊపిరి పీల్చుకున్నట్లైంది. లేని పక్షంలో సోమవారం వారు సభా హక్కుల ముందు హాజరవాల్సి వుంది. వారికి సమన్లు జారీ చేయడానికి సభా హక్కుల కమిటీకి గల పరిధిని అధికారుల తరపు న్యాయవాదు కపిల్‌ సిబల్‌, ఎం.ఎం.సింఘ్విలు ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొ న్నపుడు ఈ సంఘటన జరిగింది కానీ పార్లమెంట్‌ సభ్యునిగా ఆయన విధులను నిర్వర్తిస్తున్నపుడు జరగలేదని సిబల్‌ పేర్కొన్నారు. 144వ సెక్షన్‌ కింద విధించి నిషేధాజ్ఞలను ఎంపి ఉల్లంఘించారని తెలిపారు. ఎంపీ పోలీసు కారు బానెట్‌పైకి ఎక్కగా, పార్టీ కార్యకర్తలు తోశారని, వాస్తవానికి పోలీసులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారని సిబల్‌ చెప్పారు.
తమ వాదనలకు మద్దతుగా వీడియో సాక్ష్యాధారం కూడా వుందని చెప్పారు. పార్లమెంట్‌ సభ్యునిగా తన విధులు నిర్వర్తిస్తున్నపుడు ఆయనను ఎవరైనా అడ్డుకుంటే అది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది గానీ ఏది చేసినా రాదని సిబల్‌ పేర్కొన్నారు. కేవలం ఏం జరిగిందో తెలుసుకోవడానికే పిలిపించాం తప్ప వారిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని లోక్‌సభ సెక్రెటేరియట్‌ తరపు వాదనలు వినిపిస్తున్న దేవాశిష్‌ భరూకా పేర్కొన్నారు.